తాటిచెట్లపాలెం: విశాఖపట్నం రైల్వేస్టేషన్ ద్వారా గంజాయి అక్రమ రవాణా ప్రయత్నించిన ఇద్దరు మహిళలను ఆర్పీఎఫ్, ఎన్‌సీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆర్పీఎఫ్ సిబ్బంది వెల్లడించిన వివరాలివి. శనివారం రాత్రి రైల్వే భద్రతా దళం, నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో సభ్యులు స్టేషన్‌లోని 8వ నంబర్ ప్లాట్‌ఫాం వద్ద తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఐదు సంచులతో అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరు మహిళలను గమనించి వారిని ప్రశ్నించారు. వారు పొంతనలేని సమాధానాలు ఇవ్వడంతో వెంటనే ఎన్‌సీబీ ప్రత్యేక బృందానికి సమాచారం అందించారు. అధికారులు వారిని లోతుగా విచారించి, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గౌతమబుద్ధ నగర్‌కు చెందిన అమిత హల్దర్, నిభా హల్దర్‌లుగా గుర్తించారు. ఒడిశాలోని కోరాపుట్ నుంచి ఆగ్రాకు గంజాయిని తరలిస్తున్నట్లు అంగీకరించారు. వారి వద్ద నుంచి రూ.17.45 లక్షల విలువైన 34.9 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు లు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తనిఖీల్లో ఆర్పీఎఫ్ ఇన్‌స్పెక్టర్ కె.రామకృష్ణ, ఎస్‌ఐ పి.కె.రౌల్, ఎన్‌సీబీ(సీపీడీఎస్) బృంద సభ్యులు పాల్గొన్నారు.
యూపీకి చెందిన ఇద్దరు మహిళల అరెస్ట్


