మరమ్మతులు
● డ్యామ్ సేఫ్టీ బృందం హెచ్చరికతో
కదిలిన యంత్రాంగం
ముంచంగిపుట్టు: ఆంధ్ర – ఒడిశా రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు అయిన మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రానికి ప్రధాన నీటి వనరుగా ఉన్న జోలాపుట్టు జలాశయానికి ఎట్టకేలకు మరమ్మతులు పూర్తయ్యాయి. దశాబ్దా ల చరిత్ర కలిగిన ఈ జలాశయ గేట్లకు రంగులు వేసి, సాంకేతిక లోపాలను సరిదిద్ది కొత్త హంగులు అద్దారు.
బృందం తనిఖీలతో..
ఇటీవలే జాతీయ డ్యామ్ సేఫ్టీ బృందం ఈ అతి పురాతనమైన జలాశయాన్ని సందర్శించింది. ఈ సందర్భంగా గేట్ల పనితీరు, నీటి నిల్వ సామర్థ్యం, భద్రతా ప్రమాణాలను క్షుణ్ణంగా పరిశీలించింది. గేట్లు తుప్పు పట్టి ఉండటం, పలు సాంకేతిక సమస్యలు ఉండటాన్ని గుర్తించిన అధికారులు.. జలాశయ అధికారులపై అసహనం వ్యక్తం చేస్తూ పలు సూచనలు చేశారు.
యుద్ధప్రాతిపదికన మరమ్మతులు
కేంద్ర బృందం హెచ్చరికలతో స్పందించిన జలాశయ అధికారులు.. వెంటనే అన్ని గేట్లు, యంత్రాలకు గ్రీజు వేయించి, నలుపు రంగులు దిద్దించారు. అత్యవసర సమయాల్లో గేట్లు ఎత్తేటప్పుడు లేదా నీటిని విడుదల చేసేటప్పుడు ఎటువంటి సాంకేతిక అడ్డంకులు ఎదురుకాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు.
హెచ్చరిస్తే గాని కదలని తీరుపై విమర్శలు
జోలాపుట్టు జలాశయం గేట్లు తుప్పు పట్టి ప్రమాదకరంగా మారుతున్నాయని గతంలో అనేకసార్లు పత్రికల్లో కథనాలు వచ్చినప్పటికీ అధికారులు ఏమాత్రం స్పందించలేదు. తీరా జాతీయ స్థాయి అధికారులు వచ్చి తనిఖీ చేసి పరిస్థితి తీవ్రతను హెచ్చరిస్తే తప్ప పనులు ప్రారంభించకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని స్థానికులు విమర్శిస్తున్నారు. ఇప్పటికై నా భద్రతా ప్రమాణాలను నిరంతరం పర్యవేక్షించాలని ఏవోబీ ప్రజలు కోరుతున్నారు.


