మైనింగ్ పర్మిట్లు లేకుండానే...!
వాస్తవానికి ఏదైనా క్వారీ మైనింగ్ జరపాలంటే పర్మిట్లు తీసుకోవాల్సి ఉంటుంది. ఎంత మేర మైనింగ్ చేస్తున్నది? ఎంత మొత్తం గ్రానైట్‌ను తరలిస్తున్నారనే విషయాన్ని పేర్కొంటూ రాయల్టీ చెల్లించాల్సి ఉంటుంది. అయితే, అధికార తెలుగుదేశం పార్టీ నేత పేరుతో ఎటువంటి మైనింగ్ పర్మిట్లు లేకుండానే సుమారు రూ. 10 కోట్ల విలువైన గ్రానైట్ బ్లాక్‌లను తరలించినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా బ్లాస్టింగులు చేపడుతూ గ్రామ ప్రజలకు కూడా తీవ్ర ఇబ్బందులు గురిచేస్తున్నారనే విమర్శలున్నాయి. ఈ క్వారీ ఉన్న ప్రాంతానికి డీఆర్‌డీవో కూడా కూతవేటు దూరంలోనే ఉంది. రక్షణరంగ సంస్థకు సమీపంలో చేపడుతున్న ఈ బ్లాస్టింగులతో ఇబ్బందులు తప్పవనే ఆందోళన కూడా నెలకొంది. అర్ధరాత్రి సమయాల్లో వాహనాల సామర్థ్యానికి మించి మరీ అధిక లోడుతో భారీ గ్రానైట్ బ్లాక్‌లను తరలిస్తున్నారు. అయినప్పటికీ అటు పోలీసు, ఇటు రెవెన్యూ, మైనింగ్, రవాణా శాఖ అధికారులు కన్నెత్తి చూడడం లేదనే విమర్శలున్నాయి. భారీ లోడ్‌లతో ఈ విధంగా మొత్తం రూ. 10 కోట్ల విలువైన గ్రానైట్ బ్లాక్‌లను అక్రమంగా తరలించినట్టు మైనింగ్ విజిలెన్స్ అధికారులు గుర్తించారు. మైనింగ్ విజిలెన్స్ అధికారుల తనిఖీలో ఇక్కడ అక్రమంగా మైనింగ్ జరుగుతున్నట్టు తేలినప్పటికీ స్థానిక మైనింగ్ అధికారులు మాత్రం ఇక్కడంతా ఏమీ జరగలేదని నివేదికలు పంపిస్తుండడం గమనార్హం. నర్సీపట్నంలోని మైనింగ్ అధికారి వ్యవహారశైలిపై ఇప్పటికే అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: అర్ధరాత్రి సమయంలో అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం చింతలూరు నుంచి అక్రమంగా రాత్రి సమయాల్లో గ్రానైట్ బ్లాక్‌లను తరలిస్తున్నారు. గుంటూరు నుంచి వచ్చి మరీ వ్యవహారం నడుపుతున్న సదరు టీడీపీ నేత ఆడిందే ఆట...పాడిందే పాటగా వ్యవహారం నడిపిస్తున్నారు. గతంలో ఐటీ కంపెనీ పెట్టి... ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల నుంచి రూ.100 కోట్ల మేర వసూలు చేసి అరెస్టయిన చరిత్ర కలిగిన సదరు నేత చంద్రబాబు, లోకేష్‌లతో సన్నిహితంగా ఉన్న ఫొటోలు డీపీగా పెట్టుకుని బెదిరింపులకు దిగుతున్నట్టు విమర్శలున్నాయి. ఇప్పటివరకు అక్రమంగా భారీ గ్రానైట్ బ్లాక్‌లను అడ్డంగా తరలిస్తూ రూ.10 కోట్ల మేర ఆర్జించినట్టు తెలుస్తోంది. అక్రమ మైనింగ్ జరుపుతున్నారని, పర్మిట్లు లేకుండానే గ్రానైట్ బ్లాక్‌లను తరలిస్తున్నారంటూ దీనిపై ఇప్పటికే విజిలెన్స్ అధికారులు తమ తనిఖీల ద్వారా తేల్చారు. అయితే స్థానిక మైనింగ్ అధికారులు మాత్రం అంతా సవ్యంగానే ఉందంటూ అధికార టీడీపీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి తప్పుడు నివేదికలు ఇస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు కూటమిలోని బీజేపీ నేతలు కూడా ఈ వ్యవహారంలో ఫిర్యాదు చేస్తుండడం గమనార్హం.
కూటమి ప్రభుత్వం రాకతో జిల్లాలో అక్రమాల ఘనులు చెలరేగిపోతున్నారు. అధికారపార్టీ నేతలు ఆడింది ఆటగా.. పాడింది పాటగా అధికారులు తాళం వేస్తున్నారు. ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు. గతంలో ఐటీ ఉద్యోగాల పేరిట నిరుద్యోగులను రూ.100 కోట్ల మేర మోసం చేసిన కేసులో అరెస్టయిన టీడీపీ నేత అజయ్ కొల్లా తాజాగా అనకాపల్లి జిల్లాలో మైనింగ్ డాన్‌గా అవతారమెత్తాడు. గ్రానైట్ బ్లాక్‌ల అక్రమ రవాణాతో రూ.కోట్లు కొల్లగొడుతున్నాడు. స్థానిక మైనింగ్ అధికారులు కొమ్ము కాస్తున్నారు.
రూ. 100 కోట్ల మేర నిరుద్యోగులకు టోపీ
అనకాపల్లి జిల్లాలో మైనింగ్ డాన్‌గా వ్యవహరిస్తూ అక్రమ మైనింగ్ చేపడుతున్న సదరు టీడీపీ నేత గుంటూరు నుంచి వచ్చి మరీ ఇక్కడ దౌర్జన్యం చెలాయిస్తున్నారు. ఇతరులకు చెందిన క్వారీని ఆక్రమించి మరీ అక్రమ మైనింగ్ చేస్తున్నారనే విమర్శలున్నాయి. విజ్‌డమ్ జాబ్స్ పేరుతో నిరుద్యోగుల నుంచి రూ. 100 కోట్ల మేర వసూలు చేసిన వ్యవహారంలో హైదరాబాద్ పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఈ కేసులో మొత్తం 14 మందిని అరెస్టు చేయగా, ఇందులో సీఈవోగా ఉన్న అజయ్ కొల్లా కూడా అరెస్టయిన వారిలో ఉన్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెబుతూ నిరుద్యోగుల నుంచి రూ.100 కోట్ల మేరకు ఈ ముఠా వసూలు చేసింది. ఉద్యోగాల కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న ఈ నిరుద్యోగుల జాబితాను ఇతర కంపెనీలకు విక్రయిస్తుందని కూడా విచారణలో తేలింది. అంతేకాకుండా విజ్‌డమ్ జాబ్స్ పేరుతో స్థాపించిన కంపెనీలోని ఉద్యోగులతోనే నిరుద్యోగులకు ఫోన్ చేయించి మీకు ఫలానా కంపెనీలో ఉద్యోగం వచ్చిందంటూ కూడా మోసం చేసి ఆయా అభ్యర్థుల నుంచి ఇంత మొత్తం చెల్లించాలంటూ వసూళ్లకు పాల్పడ్డారు. అంతేకాకుండా ఎంత మందిని ఉద్యోగాల పేరుతో మోసం చేసి డబ్బులు వసూలు చేస్తే, అటువంటి ఉద్యోగులకు పర్సంటేజీల రూపంలో చెల్లించే ఏర్పాటు కూడా అజయ్ కొల్లా చేయడం గమనార్హం.


