జల విపత్తుల నుంచి ప్రాణరక్షణే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

జల విపత్తుల నుంచి ప్రాణరక్షణే లక్ష్యం

Mar 27 2026 8:47 AM | Updated on Mar 27 2026 8:47 AM

సుజనకోటలో ఎన్‌డీఆర్‌ఎఫ్‌ మాక్‌ డ్రిల్‌

మత్స్యగెడ్డ పరివాహక ప్రాంతాల

గిరిజనుల్లో చైతన్యం నింపిన విన్యాసాలు

ముంచంగిపుట్టు : మండలంలోని సుజనకోట పంచాయతీ మత్స్యగెడ్డ సాక్షిగా ప్రాణాలను ఎలా కాపాడుకోవాలో తెలిపే అద్భుతమైన విన్యాసం జరిగింది. గెడ్డలు, వాగుల్లో ప్రమాదాలు సంభవించినప్పుడు ఎలా అప్రమత్తంగా ఉండాలి, నీటిలో చిక్కుకున్న వారిని ఎలా రక్షించాలి అనే అంశాలపై జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం గురువారం భారీ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది.

సందడి చేసిన రక్షణ విన్యాసాలు

విజయవాడకు చెందిన 10వ బెటాలియన్‌ ఎన్‌డీఆర్‌ఎఫ్‌ కమాండెంట్‌ వీవీఎన్‌ ప్రసన్న, టీమ్‌ కమాండెంట్‌ ప్రదీప్‌ నేతృత్వంలో 25 మంది సభ్యుల బృందం ఈ మాక్‌ డ్రిల్‌లో పాల్గొంది. ప్రవాహంలో బోటు బోల్తా పడితే గల్లంతైన వారిని వెతికే విధానాన్ని ప్రయోగాత్మకంగా చూపారు. సహాయం కోసం నీటిలో ఎదురుచూస్తున్న వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చే ప్రక్రియను చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. ప్రమాదాలు జరగకుండా సామాన్యులు తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తలపై బృందం సభ్యులు వివరించారు.

ముఖ్య అతిథుల సందేశం

ఈ కార్యక్రమాన్ని ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గిరిజన ప్రాంతాల్లో మత్స్యగెడ్డను దాటడానికి ఎక్కువగా నాటు పడవలను ఉపయోగిస్తుంటారు.. ఈ క్రమంలోనే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇలాంటి శిక్షణా కార్యక్రమాలు మత్స్యగెడ్డ పరివాహక ప్రాంతంలోని అన్ని మండలాల్లో నిర్వహించి ప్రజలను చైతన్యపరచాలి అని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సీతమ్మ, ఎంపీడీవో ధర్మారావు, తహసీల్దార్‌ భాస్కర అప్పారావుతో పాటు సీఆర్‌పీఎఫ్‌ సీఐ శ్రావణ్‌కుమార్‌, ఎస్‌ఐ నాని, సర్పంచులు రమేష్‌, సుభాష్‌, త్రినాథ్‌, ఎంపీటీసీ సుబ్బలక్ష్మి, వైద్యాధికారి నిఖిల్‌, వివిధ పార్టీల నేతలు జగబంధు, పద్మారావు, అర్జున్‌, సన్యాసమ్మ, బలరాం, శ్రీను పాల్గొన్నారు. ప్రకృతి వైపరీత్యాల వేళ ప్రాణనష్టం జరగకుండా ఎన్‌డీఆర్‌ఎఫ్‌ చేసిన ఈ ప్రయత్నంపై స్థానిక గిరిజనులు హర్షం వ్యక్తం చేశారు.

సుజనకోట వద్ద మత్స్యగెడ్డలో మాక్‌డ్రిల్‌ నిర్వహిస్తున్న ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు

మాక్‌డ్రిల్‌ను తిలకిస్తున్న ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్‌పర్సన్‌ సుభద్ర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement