పాడేరు : జిల్లాలోని గ్రామీణ మారుమూల ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని చేరువ చేయడమే లక్ష్యంగా పనిచేయాలని కలెక్టర్ దినేష్‌కుమార్ సూచించారు. గురువారం కలెక్టరేట్ ఆవరణలో మీ ఇంటికి మీ డాక్టర్ ప్రాజెక్టులో భాగంగా నూతనంగా మంజూరైన అంబులెన్స్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అత్యవసర సమయాల్లో ఆస్పత్రులకు రాలేని రోగుల కోసం ఈ ప్రాజెక్టు ద్వారా నేరుగా గ్రామాల్లోని ఇళ్ల వద్దకు వెళ్లి అధునాతమైన వైద్య సేవలు, మందులను ఉచితంగా అందజేస్తారన్నారు. ప్రజలంతా ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఐటీడీఏ పీవో, ఇన్‌చార్జి జేసీ తిరుమణి శ్రీపూజ, అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్, డీఎంహెచ్‌వో డాక్టర్ కృష్ణమూర్తి నాయక్, ఇన్‌చార్జి డీఆర్వో అంబేడ్కర్, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ ఎస్.గంగరాజు, మేనేజ్‌మెంట్ కమిటీ సభ్యుడు నాగరాజు, కార్యదర్శి గౌరీశంకర్, కోశాధికారి సూర్యారావు పాల్గొన్నారు.


