● సమస్య పరిష్కరించిన అధికారులు
● 17 రోజుల దీక్ష విరమించిన ఆదివాసీలు
పాడేరు: దశాబ్దాల నిరీక్షణ, 17 రోజుల అలుపెరుగని పోరాటం తర్వాత చింతపల్లి మండలం లంబసింగి పంచాయతీ జలగలగెడ్డ గ్రామస్తుల రహదారి కల సాకారమైంది. జిల్లా యంత్రాంగం చొరవతో ఇన్నాళ్లూ నెలకొన్న వివాదం పరిష్కారం కావడంతో ఆదివాసీలు తమ నిరసనను విరమించారు.
వివాద నేపథ్యం..: జలగలగెడ్డ గ్రామానికి సరైన రహదారి లేక గ్రామస్తులు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన అధికారులు, కొర్రుబయలు నుంచి జలగలగెడ్డ వరకు 650 మీటర్ల బీటీ రోడ్డు నిర్మాణానికి రూ. 90 లక్షలు మంజూరు చేసింది. అయితే, ఈ రహదారి తమ పట్టా భూములు, కాఫీ తోటల గుండా వెళ్తుందంటూ కొర్రుబయలు గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మార్గమధ్యలో ఇనుప కంచెలు వేసి అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.
ఐటీడీఏ వద్ద సుదీర్ఘ పోరాటం.. : తమ గ్రామానికి వెళ్లే దారిని మూసివేయడాన్ని నిరసిస్తూ, తక్షణమే రోడ్డు పనులు ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ జలగలగెడ్డ ఆదివాసీలు తమ పిల్లపాపలతో కలిసి పాడేరు ఐటీడీఏ కార్యాలయం ఎదుట గత 17 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సమస్యపై అఖిలపక్ష బృందం డీఎల్వో ఆధ్వర్యంలో మద్దతు తెలిపింది. ఈ అంశంపై సాక్షిలో ప్రచురితమైన రహదారి రగడ శీర్షికన ప్రచురితమైన కథనం జిల్లా యంత్రాంగాన్ని కదిలించింది.
అధికారుల జోక్యంతో పరిష్కారం: జిల్లా కలెక్టర్ దినేష్‌కుమార్ ఆదేశాల మేరకు చింతపల్లి రెవెన్యూ, పోలీస్ అధికారులు బుధవారం జలగలగెడ్డకు చేరుకున్నారు. వివాదానికి కారణమైన ఇనుప కంచెలను తొలగించి, రక్షణ మధ్య రహదారి పనులను పునఃప్రారంభించారు. సమస్య సద్దుమణగడంతో గురువారం కలెక్టర్‌తో పాటు ఐటీడీఏ పీవో, జేసీ తిరుమణి శ్రీపూజకు ఆదివాసీలు వినతిపత్రాలు అందజేశారు. అధికారులు సానుకూలంగా స్పందించి పనులు మొదలుపెట్టడంతో, ఐటీడీఏ పీవో, ఇన్‌చార్జి జేసీ తిరుమణి శ్రీపూజ ఆదివాసీ మహిళలకు నిమ్మరసం ఇచ్చి దీక్షలను విరమింపజేశారు. దీంతో 17 రోజులుగా సాగుతున్న నిరసన శిబిరాన్ని గ్రామస్తులు ఎత్తివేశారు.


