అచ్యుతాపురం రూరల్ : ఖాజీపాలెంలో ఒకేరోజు మూడు దేవాలయాల్లో నగదు చోరీకి పాల్పడడంతో పాటు ఒక ఆటో దొంగతనం చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని కోర్టుకు తరలించినట్టు సీఐ చంద్రశేఖర్‌రావు తెలిపారు. సోమవారం పోలీస్‌స్టేషన్‌లో విలేకర్ల సమావేశంలో నిందితుడిని హాజరు పరిచారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ అయ్యప్ప కాలనీ, పెందుర్తికి చెందిన నిందితుడు పెందుర్తి నాగరాజు (చిన్న) తరచూ దొంగతనాలు చేయడం, దొరికితే దొంగ లేకపోతే దొరలా దర్జాగా కొనసాగిపోతున్నాడన్నారు. జైలు నుంచి విడుదలైన రోజే ఖాజీపాలెం గ్రామంలో అర్ధరాత్రి దాటిన తరువాత మూడు దేవాలయాల్లో చోరీకి పాల్పడ్డాడని, అలాగే ఒక ఆటోను దొంగిలించాడని అన్నారు. అప్పటికే వేపాడ, సబ్బవరం, పెందుర్తి, ఆనందపురం, భీమిలి, జామి, పీఎం పాలెం, పద్మనాభం, అచ్యుతాపురం స్టేషన్లలో అతనిపై పలు కేసులు నమోదై ఉన్నాయన్నారు. దేవాలయాల్లో చోరీ చేసిన రూ.8 వేల నగదులో ఒక మొబైల్ ఫోన్ కొనుక్కున్నాడన్నారు. ఆటో అనకాపల్లి శంకరం దగ్గర విడిచిపెట్టడంతో జప్తు చేసుకున్నామన్నారు. ప్రతి ఒక్కరూ చోరీల పట్ల అప్రమత్తంగా ఉండాలని సీఐ చంద్రశేఖర్‌రావు, ఎస్‌ఐ సుధాకర్‌రావు సూచించారు. ఇళ్లు, దుకాణాలకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఇప్పటికే చోరీల నివారణకు పలు చోట్ల నిఘా పెంచామన్నారు. చోడపల్లి అమ్మవారి చేతిలో కత్తి, పూడిమడక వైన్‌షాపులో చోరీ వంటి అనేక కేసుల్లో అనుమానితుల్ని ఆరా తీసామన్నారు. సమావేశంలో పోలీసు సిబ్బంది ఇల్లా శ్రీను, బంగార్రాజు ఉన్నారు.


