జాముగుడ ఆశ్రమ పాఠశాల సిబ్బందిపై ఎమ్మెల్యే మత్స్యలింగం ఆగ్రహం
సక్రమంగా మెనూ అమలు చేయకపోవడంపై ట్రైబల్ వెల్ఫేర్ డీడీకి ఫిర్యాదు
డుంబ్రిగుడ: ఎన్నిసార్లు చెప్పినా మీరు మారరా ?, మెనూ సక్రమంగా అమలు చేయకుండా విద్యార్థులను ఎందుకు ఇబ్బందులు పెడతున్నారంటూ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం మండలంలోని జాముగుడ ఆశ్రమ పాఠశాల సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన పాఠశాలను తనిఖీ చేయడంతో పాటు మెనూ అమలు తీరును పరిశీలించారు. 520 మంది విద్యార్థులుండగా, కేవలం వందమందికి సరిపడా కూర మాత్రమే ఎందుకు వండారని సిబ్బందిని ప్రశ్నించారు. ఇప్పటికే ఒకసారి పాఠశాలను తనిఖీ చేసి, హెచ్చరించినా వార్డెన్‌లో మార్పు రాలేదన్నారు. ట్రైబల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ పరిమళకు ఫోన్ చేసి వార్డెన్‌పై తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంతకు మందు పదోతరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులతో మాట్లాడి మంచి మార్కులతో పరీక్షలు ఉత్తీర్ణత సాధించాలని సూచించారు.


