మహిళలతోనే రాయగడ ఎక్స్‌ప్రెస్‌ | - | Sakshi
Sakshi News home page

మహిళలతోనే రాయగడ ఎక్స్‌ప్రెస్‌

Mar 10 2026 7:28 AM | Updated on Mar 10 2026 7:28 AM

● వాల్తేర్‌ డివిజన్‌ పరిఽధిలో ఘనంగా మహిళా దినోత్సవం ముగింపు...

తాటిచెట్లపాలెం: వాల్తేర్‌ డివిజన్‌ పరిధిలో గత వారం రోజులుగా ఎంతో ఉత్సాహంగా జరుగుతున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాలు సోమవారంతో ముగిశాయి. ఈ ముగింపు వేడుకల సందర్భంగా విశాఖ నుంచి బయలుదేరిన గుంటూరు–రాయగడ (17243) ఎక్స్‌ప్రెస్‌ రైలును మహిళా సిబ్బంది మాత్రమే నిర్వహించడం విశేషం. వాల్తేర్‌ డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ లలిత్‌ బోరో..ఈకోఆర్‌ డబ్ల్యూవో ప్రెసిడెంట్‌ జ్యోత్స్న బోరాలు కలిసి ఈ ప్రత్యేక రైలును జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం శ్రీనివాస కల్యాణ మండపంలో జరిగిన ముగింపు వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న డీఆర్‌ఎం మాట్లాడుతూ వాల్తేర్‌ డివిజన్‌ మహిళా సాధికారతలో అగ్రగామిగా నిలుస్తోందని కొనియాడారు. ప్రస్తుతం ఈ డివిజన్‌ పరిధిలో సుమారు 1,600 మంది మహిళా సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారని ఆయన తెలిపారు. ట్రాక్‌ మెయింటనెన్స్‌, ట్రైన్‌ ఆపరేషన్స్‌, లోకో ఆపరేషన్స్‌, టికెట్‌ తనిఖీలు, కార్యనిర్వాహక బాధ్యతల వంటి కీలక విభాగాల్లో మహిళలు అద్భుతమైన ప్రతిభను కనబరుస్తున్నారని, ముఖ్యంగా మహిళలతో కూడిన లోకోమోటివ్‌ షెడ్‌ను విజయవంతంగా నిర్వహిస్తున్నామని ఆయన ప్రశంసించారు. ఈ క్రమంలో ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే వుమెన్స్‌ వెల్ఫేర్‌ ఆర్గనైజేషన్‌ (ఈకోఆర్‌ డబ్ల్యూవో) చేస్తున్న విశేష కృషిని ఆయన అభినందించారు. ఈ వేడుకల సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక సెమినార్‌లో నిపుణులు పలు అంశాలపై అవగాహన కల్పించారు. కేంద్ర విద్యాలయ అధ్యాపకురాలు ప్రగతి ప్రజాపతి ‘పిల్లల మనస్తత్వం–పనిచేసే మహిళల మార్గదర్శి’ అనే అంశంపై ప్రసంగించగా, ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ ప్రతినిధి భాగ్యశ్రీ అనంత్‌ బార్బదికర్‌ సైకాలజీ, ఒత్తిడి నియంత్రణ పద్ధతులపై వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement