దేశవ్యాప్తంగా అటవీ అగ్నిప్రమాదాలు ఎక్కువగా సంభవిస్తున్న వాటిలో అల్లూరి సీతారామరాజు జిల్లా చేరడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. భారతీయ అటవీ సర్వే నివేదికల ప్రకారం ఇక్కడ ప్రమాదాల తీవ్రత హెచ్చరిక స్థాయికి చేరుకోవడంతో, అటవీ సంపదను కాపాడుకునేందుకు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ రంగంలోకి దిగింది. ముందస్తు చర్యల కోసం ప్రత్యేక నిధులను కేటాయించేందుకు కార్యాచరణ రూపొందించింది. అడవిలో మంటలు పక్క ప్రాంతాలకు వ్యాపించకుండా వ్యూహాత్మక మార్గాలను అనుసరిస్తోంది.
డవిలో
కొయ్యూరు: దేశవ్యాప్తంగా అటవీ అగ్నిప్రమాదాలు ఎక్కువగా సంభవిస్తున్న టాప్–10 జిల్లాల జాబితాలో అల్లూరి సీతారామరాజు జిల్లా చేరింది. భారతీయ అటవీ సర్వే నివేదికల ప్రకారం ఇక్కడ ప్రమాదాల తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో, పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారకముందే జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ నిధులను మంజూరు చేసేందుకు సిద్ధమైంది.
● అటవీ అధికారులు ఈ నిధులతో అగ్నిప్రమాదాలు జరిగే ప్రాంతాలను వ్యూహాత్మకంగా గుర్తించి,తగు చర్యలు చేపట్టనున్నారు.
● క్షేత్రస్థాయిలో మంటలను అదుపు చేసేందుకు సిబ్బందిని నియమించడం.మంటలు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వ్యాపించకుండా అడవిలో ఫైర్ లైన్ల ఏర్పాటుపై దృష్టి సారించారు.
● కొన్నేళ్లుగా ఉపగ్రహ చిత్రాల సాయంతో అగ్నిప్రమాదాలను గుర్తించి తక్షణ చర్యలు చేపడుతున్నారు. ఇది 370 మీటర్ల విస్తీర్ణంలో జరిగే ప్రమాదాలను కూడా గుర్తించి, అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా కచ్చితమైన ప్రాంతాన్ని సూచిస్తుంది. కిలోమీటరు మేర మంటలు వ్యాపించి ఉంటే ఈ ఉపగ్రహం సమాచారాన్ని వేగంగా పంపుతుంది.ఈ సమాచారం అందిన వెంటనే వాట్సాప్ ద్వారా క్షేత్రస్థాయి సిబ్బందిని అప్రమత్తం చేసి, మంటలు వ్యాపించకుండా ‘క్విక్ రెస్పాన్స్’ టీమ్స్ రంగంలోకి దిగుతున్నాయి.
ప్రమాదాలకు ప్రధాన కారణాలు..
జిల్లాలోని చింతపల్లి డివిజన్ పరిధిలో 1.97 , పాడేరు డివిజన్‌లో 1.94 లక్షల హెక్టార్లలో అడవి ఉంది. వీటి పరిధిలోని మర్రిపాకల, సీలేరు, ఆర్‌వీ నగర్ రేంజ్‌ల పరిధిలో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. వీటిలో ఏటా 450 వరకు చోటు చేసుకుంటున్నాయి. సీలేరు రేంజ్ పరిధిలో సుమారు 150, మర్రిపాకల రేంజి పరిధిలో 160 వరకు నమోదు అవుతున్నాయి. తూర్పు కనుముల్లో 90 శాతం వరకు ఆకులు రాల్చే చెట్లే ఉండటం వల్ల వేసవిలో ఎండుటాకులు గుట్టలుగా పేరుకుపోతున్నాయి. వీటికి నిప్పు అంటుకోవడం వల్ల కూడా ప్రమాదాలకు దారి తీస్తున్నాయి.
● 2024లో మర్రిపాకల రేంజ్‌లో యర్రగొండ నుంచి మర్రిపాకలు వెళ్లే మార్గంలో చెట్లు కాలిపో యాయి.
మానవ తప్పిదాలు..
జీడి తోటల్లో ఆకులను కాల్చే సమయంలో ఆ మంటలు అడవికి వ్యాపించడం, లేదా ఉద్దేశపూర్వకంగా కొందరు నిప్పు పెట్టడం వల్ల అడవి నాశనమవుతోంది. దీనిపై అటవీ శాఖ గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది. కొండ ప్రాంతాల్లో మంటలను ఆర్పడం అత్యంత కష్టతరమైన పని. అందుకే సిబ్బందికి అవసరమైన సౌకర్యాలపై అధికారులు దృష్టి సారించారు. సిబ్బందికి తప్పనిసరిగా షూలు, సరిపడా తాగునీరు అందజేస్తున్నారు. కొండలపైకి ఎక్కిన తర్వాత మంటలను అదుపు చేయడానికి పచ్చి చెట్ల కొమ్మలను ఉపయోగించే సంప్రదాయ పద్ధతులనే అనుసరిస్తున్నారు.
నిప్పంటుకున్న అడవి
టాప్–10 జాబితాలో అల్లూరి జిల్లా
అడవుల పరిరక్షణ అందరి బాధ్యత
అడవులను అగ్నిప్రమాదాల నుంచి రక్షించుకోవడంపై ప్రత్యేక దృష్టి సారించాం. ప్రస్తుతం అత్యాధునిక సాంకేతికతను ఉపయోగిస్తూ, ఉపగ్రహాల నుంచి సమాచారం అందిన వెంటనే మేము అప్రమత్తమవుతున్నాం. ఎక్కడైనా మంటలు చెలరేగినట్లు సమాచారం రాగానే, తక్షణ స్పందనగా మా సిబ్బందికి వాట్సాప్ ద్వారా లోకేషన్ వివరాలను పంపిస్తున్నాం. దీనివల్ల సిబ్బంది వేగంగా ప్రమాద స్థలికి చేరుకుని మంటలను అదుపు చేయగలుగుతున్నారు.అంతేకాకుండా, ఈ ప్రమాదాలను శాశ్వతంగా నివారించేందుకు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ప్రత్యేక నిధులను మంజూరు చేయనుంది. – వైవీ నర్సింగరావు,
డీఎఫ్‌వో, చింతపల్లి
అగ్నిప్రమాదాల నివారణకు రంగంలోకి
జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ
అటవీ రక్షణకు శాటిలైట్ నిఘా
వాట్సాప్ సమాచారంతో
క్విక్ రెస్పాన్స్ టీమ్స్ అప్రమత్తం


