● అటవీ శాఖ అధికారుల హెచ్చరిక
సీలేరు: ప్రస్తుత వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని, ఏజెన్సీ అటవీ ప్రాంతంలో ఎవరూ నిప్పు పెట్టవద్దని సీలేరు అటవీ శాఖ అధికారులు కోరారు. ముఖ్యంగా వేట కోసం అడవికి వెళ్లే వారు నిప్పు పెట్టడం వల్ల తీవ్రమైన అనర్థాలు సంభవిస్తున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. సీలేరు అటవీ రేంజ్ పరిధిలోని టేకు ప్లాంటేషన్లలో రాలిన ఎండుటాకులకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెడుతుండటంతో అటవీ సంపదకు నష్టం వాటిల్లుతోంది. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా అటవీ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం దారకొండ వారపు సంతలో ఫ్లెక్సీలతో విస్తృత ప్రచారం నిర్వహించారు.
పర్యావరణ పరిరక్షణ మన బాధ్యత..
అడవికి నిప్పు – మునుగడకే ముప్పు అనే నినాదంతో అడవులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అధికారులు వివరించారు. అడవులను తగులబెట్టడం వల్ల పర్యావరణం దెబ్బతినడమే కాకుండా, అనేక మూగజీవాలు ప్రాణాలు కోల్పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజనులు ఎవరూ అడవిలోకి వెళ్లి నిప్పు పెట్టే పనులు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో దారకొండ బీట్ ఆఫీసర్ లోవరాజు, ప్రకాష్, బేస్ క్యాంప్ సిబ్బంది బాలకృష్ణ, కృష్ణ, ప్రభాకర్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.


