ఆర్థిక బకాయిల చెల్లింపులో విఫలం
● ప్రభుత్వం తీరుపై యూటీఎఫ్ జిల్లాకార్యదర్శి కన్నయ్య మండిపాటు
డుంబ్రిగుడ: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయుల పట్ల మొండి వైఖరి అవలంబిస్తూ, ఆర్థిక బకాయిలను చెల్లించడంలో విఫలమైందని యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి ఎస్. కన్నయ్య మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు గురువారం ఉద్యోగులు, ఉపాధ్యాయులు కలిసి ’పోస్ట్ కార్డ్’ ఉద్యమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా తమ డిమాండ్లతో కూడిన పోస్ట్ కార్డులను పోస్ట్ బాక్సులో వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, 29 శాతం ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. అలాగే ఉద్యోగులకు, పెన్షనర్లకు చెల్లించాల్సిన బకాయిల కోసం స్పష్టమైన ’రూట్ మ్యాప్’ ప్రకటించాలని కోరారు. ఆర్థిక బకాయిలు తీర్చే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మండల యూటీఎఫ్ అధ్యక్షుడు శెట్టి బాలకృష్ణ, కార్యదర్శి రాజారావు, నాయకులు మేఘనాథరాజు, రమేష్, లవకుశ, రాజుకుమార్ పాల్గొన్నారు.


