మౌంట్‌ కాఫీ... | - | Sakshi
Sakshi News home page

మౌంట్‌ కాఫీ...

Feb 13 2026 3:35 AM | Updated on Feb 13 2026 3:35 AM

మౌంట్

మౌంట్‌ కాఫీ...

సాధారణంగా గిరిజన రైతులు తాము పండించిన పంటను దళారులకు అమ్ముకుని తక్కువ ధరతో సరిపెట్టుకుంటారు. కానీ మండలంలోని బడిమెల గ్రామానికి చెందిన ఆ ఎనిమిది మంది రైతులు అలా ఆలోచించలేదు. తమ చెమట చుక్కల విలువను తామే నిర్ణయించుకోవాలనుకున్నారు. మౌంట్‌ అరకు గిరిజన్‌ సొసైటీని స్థాపించి రూ.కోటి టర్నోవర్‌తో అరకు కాఫీ సువాసనలను వ్యాపార సామ్రాజ్యంగా మార్చారు. చదువులేకపోయినా ప్రభుత్వ సాయం, ఆధునిక సాంకేతికతను ఉపయోగించి పక్కా మార్కెటింగ్‌ వ్యూహంతో ఆదాయం పొందుతూ సాటి రైతులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు.

సరికొత్త స్ఫూర్తి

డుంబ్రిగుడ: ఉన్నత లక్ష్యానికి ఆలోచన తోడైతే విజయం వరిస్తుందని మండలంలోని బడిమెల గ్రామానికి చెందిన ఎనిమిది మంది రైతులు నిరూపించారు. అరకు కాఫీని పండించే రైతుకు, దాన్ని తాగే వినియోగదారుడికి మధ్య ఉండే ’మిడిల్‌ మెన్‌’ వ్యవస్థను తొలగించి, తామే మౌంట్‌ అరకు గిరిజన్‌ సొసైటీ పేరుతో ఒక బ్రాండ్‌గా ఎదుగుతున్నారు. వనరులు మనవే, శ్రమ మనదే అయినప్పుడు.. లాభం కూడా మనకే దక్కాలన్న ఆశయం.. అరకు కాఫీ సువాసనలు ఇప్పుడు వారి జీవితాల్లో ఆర్థిక పరిమళాలను వెదజల్లుతున్నాయి.

ఆలోచన నుంచి ఆవిర్భావం వరకు..

● 2023లో ప్రారంభమైన ఈ ప్రస్థానం కేవలం రెండేళ్లలోనే రూ.కోటి టర్నోవర్‌కు చేరుకోవడం సామాన్య విషయం కాదు. ప్రభుత్వ పథకాలను అందిపుచ్చుకుంటూనే, వ్యాపార మెళకువలపై పట్టు సాధిస్తూ అంచెలంచెలుగా ఎదుగుతున్నారు.

మౌలిక వసతులు.. పెట్టుబడి..

కేంద్ర కాఫీ బోర్డు (ఐసీడీపీ పథకం) సహకారంతో సుమారు రూ.30 లక్షలతో అత్యాధునిక యూనిట్లను వీరు ఏర్పాటు చేసుకున్నారు. కాఫీ నిల్వ కేంద్రం రూ.4.57 లక్షలు, కాఫీ శుద్ధి కేంద్రం రూ.8.23 లక్షలు, సోలార్‌ డ్రైయింగ్‌ యూనిట్లు రూ.8.25లక్షలతో నిర్మించుకున్నారు. ఈ మొత్తంలో కొంత రాయితీ రూపంలో లభించగా, మిగిలిన మొత్తాన్ని వ్యాపారం చేస్తూ తిరిగి చెల్లిస్తూ స్వయంసమృద్ధికి నిదర్శనంగా నిలుస్తున్నారు.

వ్యవస్థాగత మార్పుతో..

ఈ రైతుల విజయానికి ప్రధాన కారణం మార్కెట్‌ గమనాన్ని అర్థం చేసుకోవడం. సంప్రదాయకంగా గిరిజన సహకార సంస్థపై ఆధారపడకుండా, ’కొకోరో’ వంటి ప్రైవేట్‌ కంపెనీలతో ఒప్పందాలు చేసుకోవడం ద్వారా వీరు రెండు ప్రయోజనాలు సాధించారు. జీసీసీలో ఉండే చెల్లింపుల జాప్యాన్ని నివారించారు. మార్కెట్‌ డిమాండ్‌కు అనుగుణంగా మెరుగైన ధర పొందుతున్నారు.

● సంస్థ 2025–26 లక్ష్యాల గణాంకాలు ఆశాజనకంగా ఉన్నాయి. అడ్వాన్స్‌ రూపంలో పొందిన మొత్తం రూ. 30 లక్షలు కాగా, 26 టన్నుల కాఫీ పండ్లను సేకరించారు. వార్షిక వ్యాపార టర్నోవర్‌ సుమారు రూ. కోటి సాధించారు. ఈ రైతులు కేవలం లాభాలకే పరిమితం కాకుండా, తమ గ్రామంలోని గిరిజన మహిళలకు ఉపాధి కల్పిస్తూ స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నారు.

చదువులేకపోయినా పక్కా వ్యూహం

ప్రభుత్వ సాయం, సాంకేతికత

సద్వినియోగం

అరకు కాఫీ సామ్రాజ్యంలో

బడిమెల రైతుల కొత్త శకం

రెండేళ్లలో రూ.కోటి టర్నోవర్‌

శిఖరస్థాయికి మౌంట్‌ అరకు గిరిజన్‌ సొసైటీ బాటలు

స్థానికంగా యూనిట్‌ ఏర్పాటు చేయడం వల్ల మాలాంటి వారికి మూడు నెలలు ఉపాధి దొరుకుతోంది. కాఫీ పండ్లు ఆడించి వాటిని ఎండబెట్టి పప్పు చేసి బస్తాల్లో నింపుతున్నాం. నాతో పాటు మరో 30 మంది గిరిజనులకు పని దొరుకుతోంది.వీటితోపాటు వ్యవసాయ పనులు చేసుకుంటూ కుటుంబంతో సుఖంగా ఉంటున్నాం.

– బురిడి మిట్టు,

బడిమెల, అరమ పంచాయతీ

గ్రామంలో యూనిట్‌ ఏర్పాటుతో స్థానికంగా అనేక మంది గిరిజనులకు ఉపాధి అందిస్తున్నాం. దీని ద్వారా మాకు కూడా కొంత లాభం వస్తోంది. గతంలో జీసీసీ కొనుగోలు చేసేది కాఫీ అయితే మాకు ఆశించినంత డబ్బు వచ్చేది కాదు. ప్రస్తుతం కొక్కొరో కంపెనీకి అమ్మడం వల్ల లాభాలు బాగానే వస్తున్నాయి.

– గొల్లోరి సీతారాం, చైర్మన్‌, అరకు మౌంట్‌ సొసైటీ, బడిమెల

మౌంట్‌ కాఫీ...1
1/2

మౌంట్‌ కాఫీ...

మౌంట్‌ కాఫీ...2
2/2

మౌంట్‌ కాఫీ...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement