లక్ష్యంతోనే ఉన్నతస్థాయి సాధ్యం
కొయ్యూరు: ఉన్నత స్థితికి చేరేందుకు విద్యార్థులు ఇప్పటినుంచి లక్ష్యంతో ముందుకు సాగాలని అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్ సూచించారు. బుధవారం ఆయన మండలంలో బాలుర ఆశ్రమ పాఠశాల–1, శరభన్నపాలెం బాలుర ఆశ్రమ పాఠశాల, పెదమాకవరం బాలికల పాఠశాలను సందర్శించారు. బోధనను పరిశీలించారు. పెదమాకవరం, శరభన్నపాలెంలో టెన్త్ విద్యార్థులతో మాట్లాడారు. పదిలో మంచి మార్కులు ఎలా సాధించాలో సూచించారు. ఇప్పటినుంచి ఇష్టపడి చదివితే ఎక్కువ మార్కులు తెచ్చుకోవచ్చని తెలిపారు. గణితం, ఆంగ్లం,సైన్స్‌తో పాటు అన్ని సబ్జెక్టుల్లో పట్టు సాధించాలని కోరారు. నిరంతరం లక్ష్యంతో తపిస్తే అనుకున్నది సాధించడం సులభంగా మారుతుందన్నారు. అనంతరం ఉపాధ్యాయులతో మాట్లాడారు. విద్యార్థుల ఆరోగ్యం,బోధనపై దృష్టి సారించాలని సూచించారు. ఎవరికి ఆరోగ్యం సరిగా లేకున్నా తక్షణమే స్పందించాలని కోరారు. విద్యార్థులతో కలిసి ఆయన భోజనం చేశారు. ఆయన వెంట ఏటీడబ్ల్యూవో క్రాంతి కుమార్ ఉన్నారు.
లక్ష్యంతోనే ఉన్నతస్థాయి సాధ్యం


