జిహ్వచేపల్యం | - | Sakshi
Sakshi News home page

జిహ్వచేపల్యం

Feb 11 2026 7:37 AM | Updated on Feb 11 2026 7:37 AM

జిహ్వ

జిహ్వచేపల్యం

● ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి! ● పెదబయలు గిరిజనుల ప్రత్యేకం

నోరూరిస్తున్న ‘పొడైల మాచ్‌’.. సంతలో విరివిగా అమ్మకాలు

పెదబయలు: మన్యంలోని గిరిజనుల జీవనశైలి ఎంత విభిన్నమో, వారి ఆహారపు అలవాట్లు కూడా అంతే ప్రత్యేకం. మైదాన ప్రాంత ప్రజలతో పోలిస్తే వీరి వంటకాలు పూర్తి భిన్నంగా ఉంటాయి. సాధారణంగా అందరూ చేపలతో పులుసు లేదా ఫ్రై చేసుకుంటారు. కానీ, ఇక్కడ వేటాడిన చేపలను నిప్పులపై కాల్చి, ఆపై ఎండలో ఆరబెట్టి భద్రపరుచుకోవడం ఒక విశిష్టమైన పద్ధతి.

ఏమిటీ ‘పొడైల మాచ్‌’?

అరకు ప్రాంతంలో ’బొంగు చికెన్‌’ ఎంత ఫేమస్సో, పెదబయలు వారపు సంతల్లో ’పొడైల మాచ్‌’ (ఒరియా భాషలో కాల్చిన చేపలు) అంత పాపులర్‌.

● పెదబయలు, ముంచంగిపుట్టు సరిహద్దుల్లోని మత్స్యగెడ్డ, జోలాపుట్టు రిజర్వాయర్‌, డుడుమ డ్యాం ప్రాంతాల్లో గిరిజనులు చేపలను వేటాడుతుంటారు. వేటాడి తెచ్చిన చేపల్లో పెద్ద వాటిని పక్కన పెట్టి, చిన్న పరిగె చేపలను ఎంచుకుంటారు. వీటిని మంటల్లో పొడిపొడిగా కాల్చి, ఆ తర్వాత ఎండలో పూర్తిగా ఎండిపోయేలా చేస్తారు. పురుషులు చేపల వేటకు వెళ్తే, వాటిని కాల్చి, ఎండబెట్టి విక్రయానికి సిద్ధం చేసే బాధ్యతను మహిళలు, పిల్లలు తీసుకుంటారు. ఇలా వందలాది గిరిజన కుటుంబాలు ఈ వృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్నాయి.

సంతల్లో ఫుల్‌ డిమాండ్‌! : ప్రస్తుతం మార్కెట్లో దొరికే చెరువు చేపలు, సముద్రపు చేపల కంటే ఈ గెడ్డ చేపలకే గిరాకీ ఎక్కువ. ఎలాంటి వ్యర్థాలు, రసాయనాలు లేకుండా సహజంగా పెరిగే ఈ చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ కాల్చిన చేపలతో పులుసు వండి తినిపిస్తే, బాలింతలకు కాల్షియం లభిస్తుందని, పాలు పెరుగుతాయని గిరిజనుల నమ్మకం. అందుకే ఈ చేపలను కొనుగోలు చేయడానికి గిరిజనులు సంతల్లో ఎగబడుతుంటారు. ప్రకృతి ప్రసాదించిన ఈ సహజ రుచులు గిరిజనుల ఆరోగ్యానికి, ఆర్థిక స్థితికి వెన్నుముకగా నిలుస్తున్నాయి.

పెదబయలు సంతలో అడుగుపెడితే చాలు.. నిప్పుల మీద కాల్చిన చేపల ఘుమఘుమలు ఆహ్వానిస్తాయి. ఇవి కేవలం చేపలు మాత్రమే కాదు, గిరిజన సంస్కృతిలో భాగమైన ఒక అద్భుతమైన రుచి. జలాల్లో పట్టిన పరిగెలను అగ్గి మీద కాల్చి, ఎండలో ఆరబెట్టి ఈ వంటకాన్ని సిద్ధం చేస్తారు. సహజసిద్ధమైన ఈ చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు అని, ముఖ్యంగా బాలింతలకు ఇది గొప్ప పౌష్టికాహారమని గిరిజనులు చెబుతుంటారు. రసాయనాలు లేని స్వచ్ఛమైన ఆహారం కావాలనుకునే వారు ఈ ’పొడైల మాచ్‌’ ను అమితంగా ఇష్టపడతారు.

జిహ్వచేపల్యం 1
1/2

జిహ్వచేపల్యం

జిహ్వచేపల్యం 2
2/2

జిహ్వచేపల్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement