జిల్లాలో రూ 150 కోట్లతో రోడ్ల విస్తరణ పనులు
నాతవరం : జిల్లాలో ఆర్‌అండ్‌బీ శాఖ ద్వారా 38 రోడ్లకు రూ.150 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందని ఈఈ నందమూరి సాంబశివరావు అన్నారు. ఆయన శనివారం నాతవరంలో విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో 24 మండలాల్లో పలు రోడ్డు విస్తరణ, మరమ్మతు పనులు జరుగుతున్నాయన్నారు. నర్సీపట్నం నియోజకవర్గంలోనే రూ. 50 కోట్లతో 10 రోడ్డు పనులు జరుగుతున్నాయని తెలిపారు. తుపానుల సమయంలో జిల్లాలో దెబ్బతిన్న, శిథిలమై, ప్రమాదకరంగా ఉన్న 10 వంతెనలు గుర్తించామని, ఆయా వంతెనలు పనులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని తెలిపారు. త్వరలోనే పనులు ప్రారంభిస్తామన్నారు. అందులో భాగంగానే నర్సీపట్నం తుని మధ్య నాతవరం మండలం గన్నవరం మెట్ట వద్ద రోడ్డుకు వెదుళ్లగెడ్డపై వంతెన నిర్మించాల్సి ఉందన్నారు. నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధి బలిఘట్టం నుంచి నాతవరం మండలం శృంగవరం గ్రామం వరకు రోడ్డు విస్తరణకు రూ.7కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. మార్చి నాటికి సగానికి పైగా రోడ్డు పనులు పూర్తికి దృష్టి సారించామన్నారు. జూలై నాటికి చాలా వరకు రోడ్డు పనులు పూర్తవుతాయని తెలిపారు. తాండవ రిజర్వాయరుకు వెళ్లే తారురోడ్డు నాణ్యతా ప్రమాణాలు విషయంలో రాజీ పడకుండా పనులు చేయాలని కాంట్రాక్టరు రమణ జేఈ నాయుడుకు సూచించామన్నారు. కార్యక్రమంలో అర్‌అండ్‌బీ డీఈ ఆర్.కె. విద్యాసాగర్, జేఈలు నారాయణరెడ్డి నాయుడుబాబు పాల్గొన్నారు.


