అనాలోచిత చర్యలతో రూ.2.79 కోట్ల మేర నష్టం | - | Sakshi
Sakshi News home page

అనాలోచిత చర్యలతో రూ.2.79 కోట్ల మేర నష్టం

Jan 31 2026 6:37 AM | Updated on Jan 31 2026 6:37 AM

అనాలో

అనాలోచిత చర్యలతో రూ.2.79 కోట్ల మేర నష్టం

● నిర్ణయంలో జాప్యం..
చింతపల్లి గిరిజన సహకార సంస్థ అధికారుల ఉదాసీనత, అనాలోచిత నిర్ణయాలు సంస్థకు కోలుకోలేని దెబ్బ తీశాయి. రైతుల నుంచి సేకరించిన ఆర్గానిక్‌ కాఫీ గింజల విక్రయంలో సరైన సమయంలో నిర్ణయం తీసుకోకపోవడంతో సుమారు రూ. 2.79 కోట్ల మేర నష్టం వాటిల్లింది. అధిక ధర వస్తుందని ఆశించి నిల్వ చేయడం, చివరకు నాణ్యత తగ్గి తక్కువ ధరకే విక్రయించాల్సి రావడంతో ఈ భారీ ఆర్థిక నష్టం తప్పలేదు. పది నెలల కాలయాపన సంస్థ టర్నోవర్‌ను దెబ్బతీయడమే కాకుండా, విమర్శలకు తావిచ్చింది

జీసీసీకి శాపం

సెప్టెంబర్‌లో కిలో రూ. 280కు అమ్మే అవకాశం ఉన్నా కాదన్నారు.. ఇప్పుడు రూ. 238 కే తెగనమ్మారు! చింతపల్లి డివిజన్‌ పరిధిలో 510 టన్నుల కాఫీ గింజల నిల్వ వల్ల సంస్థకు రూ.2.79 కోట్ల మేర నష్టం వాటిల్లింది.

గిరిజన సహకార సంస్థకు కోలుకోలేని దెబ్బ

కాఫీ విక్రయాల్లో పది నెలలుగా కాలయాపన

ఫలితంగా గింజల నాణ్యత తగ్గుదల

సంస్థ టర్నోవర్‌పై తీవ్ర ప్రభావం

అధికారుల ఉదాసీనతే కారణం

చింతపల్లి: గిరిజన సహకార సంస్థ కాఫీ గింజల విక్రయంలో తీసుకున్న నిర్ణయాల వల్ల సంస్థకు భారీగా నష్టం వాటిల్లింది. సుమారు రూ.2.79 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి

● 2024 డిసెంబర్‌ నుంచి 2025 మార్చి మధ్య కాలంలో చింతపల్లి డివిజన్‌ పరిధిలోని చింతపల్లి, గూడెంకొత్తవీధి, కొయ్యూరు మండలాల రైతుల నుంచి గిరిజన సహకార సంస్థ ఆర్గానిక్‌ కాఫీ గింజలను కొనుగోలు చేసింది.కిలోకు రూ. 330 చొప్పున చెల్లించి సేకరించారు. చింతపల్లి మండలంలో 3.01 లక్షల కిలోలు, గూడెంకొత్తవీధి మండలంలో 2.01 లక్షల కిలోల కాఫీని సేకరించారు.చింతపల్లి, గూడెంకొత్తవీధి గోదాముల్లో కలిపి సుమారు 510 టన్నుల (5.1 లక్షల కిలోలు) కాఫీ గింజలు గత పది నెలలుగా నిల్వ ఉన్నాయి. వీటి విలువ సుమారు రూ. 16.5 కోట్లు ఉంటుందని అంచానా. కాఫీ గింజల విక్రయ విషయంలో అధికారులు సరైన సమయంలో నిర్ణయం తీసుకోకపోవడమే ఈ నష్టానికి ప్రధాన కారణమని తెలుస్తోంది.గత సెప్టెంబర్‌లో ప్రైవేటు వ్యాపారులు కిలోకు రూ. 280 ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. అయితే, కొనుగోలు ధర (రూ. 330) కంటే తక్కువగా ఉందని అప్పట్లో సంస్థ విక్రయానికి నిరాకరించింది. నిల్వలు పెరిగిపోవడంతో, ఇటీవల బెంగళూరుకు చెందిన ఒక సంస్థకు కేవలం రూ. 238 కే విక్రయించారు. కొనుగోలు చేసిన ధరతో పోలిస్తే కిలోకు రూ. 92 చొప్పున నష్టం వాటిల్లింది. దీనివల్ల సంస్థకు మొత్తం రూ. 2.79 కోట్ల నష్టం కలిగింది.

● గత సెప్టెంబర్‌లోనే రూ. 280కు అమ్మి ఉంటే, నష్టం రూ. 1.5 కోట్లకు పరిమితమయ్యేదని, పైగా రూ. 10 కోట్ల టర్నోవర్‌ జరిగేదని ఉద్యోగులు, రైతులు అభిప్రాయపడుతున్నారు. పది నెలల కాలయాపన వల్ల కాఫీ నాణ్యత తగ్గడమే కాకుండా, సంస్థ ఆర్థికంగా కూడా భారీ దెబ్బ తింది.

జీసీసీకి నష్టం వాస్తవమే

గిరిజన సహకార సంస్థ ద్వారా ఆర్గానిక్‌ కాఫీని సంస్థ ఉన్నతాధికారులు అమ్మకాలు నిర్వహించారు. ప్రస్తుతం చింతపల్లి గోదాంలో ఉన్నటువంటి 310 టన్నులు కాఫీని కిలో రూ.238 ధరకు విక్రయించారు. దీనివల్ల గిరిజన సహకార సంస్థకు నష్టం వాటిల్లడం వాస్తవమే.అయినప్పటికీ గిరిజన కాఫీ రైతాంగానికి గిట్టుబాటు ధర లభించింది.

– సింహాచలం, డివిజనల్‌ మేనేజర్‌,

జీసీసీ, చింతపల్లి

అనాలోచిత చర్యలతో రూ.2.79 కోట్ల మేర నష్టం1
1/2

అనాలోచిత చర్యలతో రూ.2.79 కోట్ల మేర నష్టం

అనాలోచిత చర్యలతో రూ.2.79 కోట్ల మేర నష్టం2
2/2

అనాలోచిత చర్యలతో రూ.2.79 కోట్ల మేర నష్టం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement