పాత ఉపాధి హామీ పథకాన్నికొనసాగించాలి
● వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి వెంకన్న డిమాండ్
దేవరాపల్లి: కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన వీబీజీ రామ్ జీ పథకాన్ని ఉప సంహరించుకుని పాత పథకాన్ని కొనసాగించాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి డి.వెంకన్న డిమాండ్ చేశారు. ఈ మేరకు దేవరాపల్లిలో ఉపాధి కూలీలతో కలిసి గురువారం ఆయన నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మార్పు నేపథ్యంలో రాష్ట్రానికి 2025–2026 ఆర్థిక సంవత్సవరంలో అదనపు పనిదినాలు, బడ్జెట్‌పై ఆశలు అడుగంటుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కూలీలకు ఉపాధి అవకాశాలు సైతం పూర్తిగా తగ్గిపోనున్నాయన్నారు.2022–2023, 2023–2024, 2024–2025 సంవత్సరాల్లో దాదాపు 12 కోట్ల చొప్పున పని దినాలు కేటాయించిన కేంద్రం, ఈ ఆర్థిక సంవత్సరం 2025–2026లో 7.5 కోట్లకు పరిమితం చేసిందన్నారు. వీబీ జీరామ్ జీ చట్టంతో రాష్ట్రాలపై పెనుభారం పడుతుందని, ఈ నేపథ్యంలోనే ఈ ఆర్థిక సంవత్సవరంలో 1000 కోట్ల మేర బడ్జెట్ వచ్చే అవకాశాన్ని కోల్పోయిందన్నారు. వచ్చే రెండు నెలల్లో ఉపాధి, అభివృద్ధి పనులపై తీవ్ర ప్రభావం చూపనుందని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వీబీ జీరామ్ జీ పథకాన్ని వ్యతిరేకిస్తూ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని శాసనసభ, మండలిలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలని వెంకన్న డిమాండ్ చేశారు. ప్రతీ కుటుంబానికి 200 రోజుల పనిదినాలు, రూ.600 కూలీ సొమ్ము ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనికి కోసం ఉపాధి కూలీలంతా ఐక్యతగా పోరాటానికి సిద్ధం కావాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి డి.వెంకన్న పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కె.పైడితల్లమ్మ, యు.కొండమ్మ, సూరిబాబు, వరలక్ష్మి, సూరమ్మ పాల్గొన్నారు.


