ప్రజాధనం పక్కదారి
గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి అంటే కేవలం కాగితాలకే పరిమితమా? గిరిజనుల ప్రాణాల కంటే రాజకీయ నేతల వ్యాపార ప్రయోజనాలే ముఖ్యమా?.. అల్లూరి జిల్లాలో ముఖ్యంగా పాడేరు నియోజకవర్గంలో ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఇదే నిజమనిపిస్తోంది. ఒకవైపు గిరిజన గ్రామాలు కనీస రవాణా సౌకర్యం లేక బాహ్య ప్రపంచానికి దూరంగా కొట్టుమిట్టాడుతుంటే, మరోవైపు టీడీపీ నేతల సొంత ఆస్తుల కోసం ప్రజాధనం వరదలా పారుతోంది.
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం:
అల్లూరి సీతారామరాజు జిల్లాలో గిరిజన గ్రామాల అభివృద్ధికి కేటాయించాల్సిన నిధులు ఎలా దారి మళ్లుతున్నాయో చెప్పడానికి పాడేరులో నిర్మించిన ఒక షాపింగ్ కాంప్లెక్స్, సినిమా థియేటర్ సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నాయి. 2014–19 మధ్య కాలంలో అప్పటి ప్రభుత్వ అండదండలతో, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అనుచరులు ఆర్టీసీకి చెందిన విలువైన స్థలాన్ని లీజు పేరుతో దక్కించుకున్నారు. నిబంధనల ప్రకారం ప్రభుత్వ నిధులను ప్రైవేట్ వ్యక్తుల వ్యాపార సముదాయాల కోసం ఖర్చు చేయకూడదు. కానీ, ఇక్కడ అధికార బలంతో చట్టాలు చుట్టాలయ్యాయి.ముందు భాగంలో భారీ షాపింగ్ కాంప్లెక్స్, వెనుక వైపు సినిమా థియేటర్‌ను నిర్మించిన సదరు నేతలు, తమ వ్యాపార లాభాల కోసం ప్రభుత్వ యంత్రాంగాన్ని పావుగా వాడుకున్నారు. మూడు వైపులా రహదారి సౌకర్యం ఉన్నప్పటికీ, మరింత విలాసవంతంగా మార్చుకోవడానికి మండల పరిషత్ నిధులపై కన్నేశారు.
రూ.10 లక్షల నిధుల మళ్లింపు
నిజానికి, ఈ రూ.10 లక్షల నిధులు మారుమూల గిరిజన పల్లెల్లో కనీసం నడవడానికి వీలులేని మట్టి రోడ్లను బాగు చేయడానికి ఉపయోగించాల్సింది. కానీ, అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి సుమారు 200 మీటర్ల మేర సిమెంట్ రోడ్డును ఆ కాంప్లెక్స్‌కు మూడు వైపులా నిర్మించారు. గిరిజన సంక్షేమ నిధులను ఇలా ప్రైవేట్ వ్యాపారాల కోసం మళ్లించడంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మా ఊరికి రోడ్డు వేయమంటే బడ్జెట్ లేదంటారు.. మరి నేతల ఆస్తులకు రోడ్లు వేయడానికి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అని గిరిజన సంఘాలు నిలదీస్తున్నాయి. ఈ అక్రమ నిర్మాణాలు, నిధుల మళ్లింపుపై తక్షణమే విచారణ జరిపించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. దుర్వినియోగం చేసిన రూ.10 లక్షలను సంబంధిత నేతలు, అధికారుల నుంచి రికవరీ చేయడమే కాకుండా నిబంధనలకు విరుద్ధంగా నిధులు మంజూరు చేసిన అధికార యంత్రాంగంపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వెంటనే ప్రాధాన్యత క్రమంలో రోడ్డు సౌకర్యం లేని గిరిజన గ్రామాలకు నిధులు కేటాయించి ‘డోలీ’ మోతల కష్టాలను తీర్చాలని వారు విన్నవిస్తున్నారు.
రోడ్ల సౌకర్యం లేక గాలిలో ప్రాణాలు..
పాడేరు నుంచి కొయ్యూరు వరకు ఏజెన్సీలోని అనేక గ్రామాల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. ముల్లుమెట్ల నుంచి సిల్వర్‌నగర్ వరకు అంబులెన్స్ వెళ్లేందుకు కనీసం మట్టి రోడ్డు కూడా లేదు. 2025, డిసెంబర్ 21న జరిగిన సంఘటన నాగరిక సమాజం తలదించుకునేలా చేసింది. గెమ్మెలి శాంతి అనే గర్భిణిని ప్రసవ వేదనతో కుటుంబ సభ్యులు కిలోమీటర్ల మేర ‘డోలీ’లో మోసుకుంటూ వచ్చారు. అంబులెన్స్ అందుబాటులో లేక ఆటోలో తరలిస్తుండగానే ఆమె ప్రసవించింది. సరైన వైద్యం అందక ఆ పసికందు కళ్లు తెరవకముందే ప్రాణాలు విడిచింది. ఇలాంటి హృదయ విదారక ఘటనలు ఏజెన్సీలో నిత్యకృత్యమయ్యాయి. కొయ్యూరు మండలం జులబంద వంటి గ్రామాల్లో కూడా రోడ్లు లేక రోగులు మార్గమధ్యలోనే ప్రాణాలు వదులుతున్న పరిస్థితి నెలకొంది.
గిరిజనులకు డోలీ కష్టాలు.. టీడీపీ నేతలకు సిమెంటు రోడ్లు
పాడేరు ఆర్టీసీ స్థలంలో మాజీ ఎమ్మెల్యే గిడ్డి అనుచరుల షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం
దొడ్డిదారిలో రూ.10 లక్షల
మండల పరిషత్ నిధులతో రోడ్లు
గిరిజన గ్రామాలకు రోడ్లు లేక అవస్థలు
టీడీపీ నేతల షాపింగ్ కాంప్లెక్సులు, థియేటర్లకు మాత్రం వన్నెలు
అధికారుల తీరుపై గిరిజనుల ఆగ్రహం


