పర్యాటక రంగంలో సరికొత్త ‘అరకు’ | - | Sakshi
Sakshi News home page

పర్యాటక రంగంలో సరికొత్త ‘అరకు’

Jan 30 2026 4:13 AM | Updated on Jan 30 2026 4:13 AM

పర్యా

పర్యాటక రంగంలో సరికొత్త ‘అరకు’

అరకులోయ టౌన్‌: రాష్ట్ర పర్యాటకాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్‌ అన్నారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యరాణితో కలిసి ఆయన ’అరకు చలి ఉత్సవ్‌–2026ను గురువారం ఘనంగా ప్రారంభించారు. లంబసింగిలో టెంట్‌ సిటీ, మారేడుమిల్లిలో హోం స్టేల అభివృద్ధి పనులకు వారు శ్రీకారం చుట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ’స్వదేశీ దర్శన్‌ 2.0’ పథకం కింద రూ.29.88 కోట్లతో బొర్రా గుహలను అంతర్జాతీయ ప్రమాణాలతో లైటింగ్‌, ఫ్లోరింగ్‌, సేఫ్టీ రేయిలింగ్స్‌ వంటి సౌకర్యాలు కల్పిస్తామన్నారు. హరిత రిసార్ట్స్‌ ఆధునీకరణకు 42.30 కోట్లు వెచ్చిస్తున్నామని తెలిపారు. మారేడుమిల్లి, అరకు, పాడేరు, లంబసింగి ప్రాంతాల్లో సుమారు 93 హోం స్టేలను ఏర్పాటు చేసి గిరిజనులకు ఉపాధి కల్పిస్తామన్నారు. రాబోయే పదేళ్లలో ప్రతి కుటుంబానికి ఒక పర్యాటక ఉపాధి కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. అరకును పూర్తిస్థాయిలో తీర్చిదిద్దుతామని మంత్రి పేర్కొన్నారు. ’జల్‌–జంగిల్‌–జమీన్‌’ స్ఫూర్తితో పర్యావరణహిత పర్యాటకాన్ని ప్రోత్సహిస్తామన్నారు. అరకు కాఫీ తోటలను పర్యాటకంతో అనుసంధానం చేసి గిరిజన రైతులకు లాభం చేకూర్చేలా కేంద్రాలను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఈ ఉత్సవాల్లో 30న డిప్యూటీ సీఎం కొణిదెల పవన్‌ కల్యాణ్‌ పాల్గొంటారని, త్వరలోనే సీఎం చంద్రబాబు నా యుడు కూడా అరకును సందర్శిస్తారని మంత్రి వెల్లడించారు. విశాఖ ఉత్సవ్‌లో అరకు చలి ఉత్సవ్‌ అంతర్భాగమని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ను అభినందించారు. మంత్రి గుమ్మడి సంధ్యారాణి మాట్లాడుతూ గిరిజనుల సంస్కృతీ సంప్రదాయాల కలయికగా ఆంధ్రా ఊటీ అరకులోయలో ఉత్సవాలు రంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయన్నారు. గిరిజనుల ఆర్థి క ప్రగతి తమ ప్రభుత్వం బాటలు వేస్తుందన్నారు.

అగ్రగామిగా నిలపడమే లక్ష్యం: పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌ జైన్‌

పర్యాటక రంగంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలవడమే ప్రభుత్వ లక్ష్యమని పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌ జైన్‌ అన్నారు. రాష్ట్రంలోని ప్రతీ జిల్లాలో అక్కడి స్థానిక సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా పర్యాటక ఉత్సవాల క్యాలండర్‌ను రూపొందించామన్నారు. ప్రజలు ఆరోగ్యంగా, సంపన్నంగా, సంతోషంగా ఉండాలన్నదే ప్రభుత్వ సంకల్పం అన్నారు. విజయవాడ, అమరావతి, గండికోట,ప్లెమంగో, కోనసీమ ఉత్సవాల తరహాలోనే అరకు ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. సీ టు స్కై కింద విశాఖ సముద్రతీరం నుంచి అరకు కొండల వరకు 9 రోజుల పాటు విశాఖ, అనకాపల్లి, అరకు ఉత్సవం కొనసాగుతుందన్నారు.

సరికొత్త శకం: కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌

ప్రకృతి రమణీయతకు నిలయమైన అరకులోయలో చలి ఉత్సవ్‌ అత్యంత వైభవంగా ప్రారంభమైందని, పర్యాటక రంగమే ఈ ప్రాంత అర్థిక ప్రగతికి ప్రధాన శక్తి అని కలెక్టర్‌ ఏఎస్‌ దినేష్‌ కుమార్‌ అన్నారు. గతంలో అరకు ఉత్సవాలను ఎంతో ఉత్సాహంగా నిర్వహించామని, ఈ ఏడాది కూడా నాలుగు రోజుల పాటు వీటిని నిర్వహిస్తామన్నారు. గతంలో ఏటా 20 నుంచి 25 లక్షలుగా ఉన్న అరకు సందర్శనకు వచ్చే పర్యాటకుల సంఖ్య ప్రస్తుతం 72 లక్షలకు చేరిందన్నారు. అంతర్జాతీయ పర్యాటకులు అరకు పర్యటనకు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. 17 పర్యాటక ప్రాంతాలను అనుసంధానిస్తూ రూ. 100 కోట్లతో రహదారుల నిర్మాణం చేపట్టామన్నారు. 680 గిరిజన కుటుంబాలకు శిక్షణ ఇచ్చి హోం స్టేలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. నాలుగు రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో ప్రతీ రోజు రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు. ఈనెల 30న శనారీ బ్యాండ్‌, 31న ప్రముఖ గాయనీ సునీత సంగీత విభావరి, ఫిబ్రవరి 1న రామ్‌ మిరియాల సంగీత కచేరి, అరకు డిగ్రీ విద్యార్థులతో ట్రైబల్‌ ఫ్యాషన్‌ షోలతోపాటు సైక్లింగ్‌, మారథాన్‌ తదితర కార్యక్రమాలు ఉంటాయని కలెక్టర్‌ పేర్కొన్నారు. పలు కళాప్రదర్శనలతో సాగిన కార్నివాల్‌ను మంత్రులు తిలకించారు. డోలు వాయించి, కళాకారులతో కలిసి నృత్యం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ అమిత్‌బర్దర్‌, ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్‌ నూకసాని బాలాజీ, ఏపీఎస్‌ ఆర్టీసీ చైర్మన్‌ నార్త్‌జోన్‌ సియ్యారి దొన్నుదొర, జీసీసీ చైర్మన్‌ కిడారి శ్రావణ్‌కుమార్‌, ఏపీటీపీసీ డైరెక్టర్‌ కిల్లు వెంకటరమేష్‌ నాయుడు, సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌ గంగులయ్య, ఇన్‌చార్జి జాయింట్‌ కలెక్టర్‌, పాడేరు ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ, ఇన్‌చార్జి డీఆర్వో అంబేద్కర్‌, సహాయ కలెక్టర్‌ సాహిత్‌, ఇన్‌చార్జి ఆర్డీవో ఎంవిఎస్‌ లోకేశ్వరరావు పాల్గొన్నారు.

అంతర్జాతీయ స్థాయికి మన్యం అందాలు

రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి

కందుల దుర్గేష్‌

ఘనంగా అరకు చలి ఉత్సవ్‌–2026 ప్రారంభం

ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు

పర్యాటక రంగంలో సరికొత్త ‘అరకు’ 1
1/2

పర్యాటక రంగంలో సరికొత్త ‘అరకు’

పర్యాటక రంగంలో సరికొత్త ‘అరకు’ 2
2/2

పర్యాటక రంగంలో సరికొత్త ‘అరకు’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement