రిజర్వేషన్లు, ప్రత్యేక డీఎస్సీపై తేల్చాల్సిందే
● స్పందించకుంటే చలో అసెంబ్లీకి
పిలుపునిస్తాం
● ఆదివాసీ ప్రత్యేక డీఎస్సీ సాధన కమిటీ జిల్లా కన్వీనర్ ధర్మన్నపడాల్ హెచ్చిరక
పాడేరు: ఆదివాసీలకు నూరు శాతం ఉద్యోగ రిజర్వేషన్, ప్రత్యేక డీఎస్సీపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోతే చలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపునిస్తామని ఆదివాసీ ప్రత్యేక డీఎస్సీ సాధన కమిటీ జిల్లా కన్వీనర్ ధర్మన్నపడాల్ హెచ్చరించారు. స్థానిక ఐటీడీఏ ఎదురుగా ఆదివాసీ ప్రత్యేక డీఎస్సీ సాధన కమిటీ, ఆదివాసీ నిరుద్యోగుల సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన 24 గంటల రిలే నిరాహార దీక్షదారులకు ఆదివాసీ ఉద్యోగ, ప్రజా సంఘాల నాయకులు ప్రసాద్‌రావు, కొండబాబు గురువారం నిమ్మరసం ఇచ్చి తాత్కాలికంగా విరమింపజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ అరకు పర్యటనలో సీఎం చంద్రబాబు ఇచ్చిన హమీ నిలబెట్టుకోవాలన్నారు. ఎన్నికల సమయంలో అబద్ధపు హమీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక హమీలను విస్మరించడం సరికాదన్నారు. ఐదో షెడ్యూల్ గిరిజన ప్రాంతంలో తక్షణం జీవో నంబరు 3 అమలు చేయాలని, ప్రత్యేక డీఎస్సీ ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. ఉద్యోగ రిజర్వేషన్ లేక ఆదివాసీ నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నరన్నారు. ప్రభుత్వం స్పందించి నూరుశాతం ఉద్యోగ రిజర్వేషన్ అమలుపై ఆర్డినెన్స్ జారీ చేయాలని, 2026 మెగా డీఎస్సీలో స్థానిక నిరుద్యోగులకు ఉపాధ్యాయ పోస్టులు కేటాయించాలన్నారు. లేకుంటే అసెంబ్లీ ముట్టడికి పిలుపునిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నేతలు శంకర్, భాను, సురేష్, రాజంనాయుడు, సుధీర్ పాల్గొన్నారు.


