అడవులను పరిరక్షించుకోవాలి
ముంచంగిపుట్టు: అడవులకు నిప్పు పెట్టి నాశనం చేయవద్దని, ప్రతి ఒక్కరూ అడవులను పరిరక్షించుకోవాలని అటవీశాఖ ముంచంగిపుట్టు రేజంర్ ఎం. మురళీకృష్ణ సూచించారు. మండలంలోని బంగారుమెట్ట పంచాయతీలో పలు గ్రామాల్లో బుధవారం అడవికి నిప్పు, అడవిలో గంజాయి సాగు నివారణపై అటవీశాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. సంభవించే అగ్ని ప్రమాదాలు,కలుగు నష్టాలపై వివరించారు. ఈ సందర్భంగా రేంజర్ మురళీకృష్ణ మాట్లాడుతూ అటవీ ప్రాంతాల్లో మంటలు పెట్టవద్దని సూచించారు. ఉద్దేశపూర్వకంగా మంటలు పెట్టి పోడు వ్యవసాయం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడమే కాకంఉడా రేషన్ కార్డు రద్దు చేస్తామని ఆయన హెచ్చరించారు. అడవులు,వన్యప్రాణుల వల్ల మానవులకు ఎంతో మేలు జరుగుతుందని, అడవులను నాశనం చేయడం వల్ల ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ సెక్షన్ అధికారి సీహెచ్ నారాయణపడాల్, ఫారెస్ట్ బీట్ అధికారులు బి.వెంకటరాజు, కె.శ్రీను,అసిస్టెంట్ బీట్ అధికారి రామారావు పాల్గొన్నారు.


