● ఐదుగురికి గాయాలు
● కొక్కిరాపల్లి హైవే కూడలి వద్ద ప్రమాదం
యలమంచిలి రూరల్: రెక్కాడితే గానీ డొక్కాడని బతుకులు వారివి..కూలి పనికి వెళితేనే..నాలుగు వేళ్లూ నోట్లోకి వెళతాయి. పొట్టకూటి కోసం వంటపనికి వెళ్లి ఇంటికి తిరిగి వస్తున్న వారిపై విధి చిన్నచూపు చూసింది.వారు ప్రయాణిస్తున్న వాహనమే మృత్యు శకటంగా మారింది.యలమంచిలి మున్సిపాలిటీ పరిధి కొక్కిరాపల్లి వద్ద 16వ నంబరు జాతీయ రహదారిపై శనివారం సాయంత్రం కారు బోల్తా పడిన ప్రమాదంలో మహిళ దుర్మరణం చెందగా,మరో ఐదుగురు గాయపడ్డారు. యలమంచిలి రూరల్ ఎస్‌ఐ ఎం ఉపేంద్ర తెలియజేసిన వివరాల ప్రకారం పాయకరావుపేటకు చెందిన వంట మాస్టర్ సతీష్,అదే ప్రాంతానికి చెందిన ఐదుగురు మహిళా సహాయకులతో అనకాపల్లిలో ఓ ఫంక్షన్‌కు వెళ్లి పని ముగించుకుని శనివారం సాయంత్రం కారులో పాయకరావుపేటకు వస్తున్నారు. కొక్కిరాపల్లి హైవే కూడలి వద్దకు వచ్చేసరికి కారు వెనుక టైరు పంక్చరై రోడ్డు డివైడర్‌పై నుంచి అవతల వైపునకు దూసుకెళ్లి బోల్తా పడింది.ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న షేక్ మీరాబీ(35)అక్కడికక్కడే మరణించింది.కారు డ్రైవర్ సతీష్(వంటమాస్టర్)తో పాటు పి దుర్గ,ఎన్.వరలక్ష్మి,డి శివమ్మ,సుభద్ర గాయపడ్డారు.వీరిలో ఇద్దరు తీవ్రంగా గాయపడడంతో హైవే అంబులెన్సులో అనకాపల్లి ఎన్‌టీఆర్ ఆస్పత్రికి తరలించారు. మీరాబీ మృతదేహాన్ని యలమంచిలి మార్చురీలో భధ్రపరిచారు.మృతురాలి సోదరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై కొంతసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మీరాబీ మృతిచెందడంతో ఆమె కుటుంబీకులు యలమంచిలి మార్చురీ వద్ద గుండెలవిసేలా రోదించారు.


