పశువైద్య శిబిరాలతో రైతులకు ప్రయోజనం
నర్సీపట్నం/నాతవరం: పాడి రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం నిర్వహిస్తున్న పశు వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ ముఖ్య కార్యనిర్వహణ అధికారి డాక్టర్ ఎం.శ్రీనివాసరావు పేర్కొన్నారు. నర్సీపట్నం మండలం నీలంపేట గ్రామంలో నిర్వహించిన పశువైద్య శిబిరంలో ఆయన మాట్లాడారు. పశువులు క్షేమంగా ఉంటేనే రైతులకు ఆదాయం సమకూరుతుందన్నారు. ఈనని పశువులకు 45 రోజుల తర్వాత కట్టు చూలి ఇంజక్షన్ వేయించాలన్నారు. లేగ దూడలు పుట్టిన పది రోజులకి పాములు మందు పట్టాలన్నారు. ఆర్నెల్ల తర్వాత ప్రతి మూడు నెలలకు పేడ పరీక్షలు చేయించి రిపోర్ట్ ఆధారంగా పాముల మందులు పట్టాలన్నారు. పశు వైద్య శిబిరంలో 142 పశువులకు పశువైద్యులు నరేష్, పుష్ప వైద్య పరీక్షలు నిర్వహించారు. 33 లేక దూడలు, 38 గొర్రెలకు పాముల మందులు పట్టించామని నర్సీపట్నం ఏరియా వెటర్నరీ ఆస్పత్రి సహాయ సంచాలకులు డబ్ల్యూ.రాంబాబు తెలిపారు. అదేవిధంగా గోపాలమిత్రుల సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కిల్లాడ వెంకటరమణ ఆధ్వర్యంలో నాతవరం మండలం జిల్లేడుపూడిలో లింగ నిర్ధారణ వీర్య నాళికలపై అవగాహన సదస్పు ఏర్పాటు చేశారు. రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ ముఖ్య కార్యనిర్వహణ అధికారి డాక్టర్ శ్రీనివాసరావు పాల్గొని మాట్లాడారు. ఉమ్మడి జిల్లాలో జిల్డేడుపూడి పంచాయతీలో ఇంజక్షన్లుతో కృత్రిమ గర్భధారణతో అధిక శాతం పశువులకు ఆడ పెయ్యిలు జన్మించాయన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టరు ఎం. చంద్రశేఖర్, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి శ్రీనివాస్, జిల్లా డిప్యూటీ డైరెక్టరు పి.వి.రామమోహన్‌రావు, పాయకరావుపేట ఏడీ సురేష్, మాజీ డీఎల్‌డీఎ చైర్మన్ డి.రాఘవేంద్రరావు, సర్పంచ్‌లు సత్యవతి, లాలం రమణ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.


