16న సింహగిరిపై నెలగంట
ఆయా పర్వదినాల్లో దర్శనాల వేళల్లో మార్పులు, ఆర్జిత సేవలు నిలుపుదల
సింహాచలం: సింహగిరిపై ఈనెల 16న నెలగంట ఉత్సవాన్ని విశేషంగా నిర్వహించనున్నట్టు దేవస్థానం ఇన్‌చార్జి ఈవో ఎన్.సుజాత తెలిపారు. ఆరోజు నుంచి నెలరోజులపాటు ధనుర్మాసం పూజలు జరుగుతాయని పేర్కొన్నారు. ఈనెల 16 నుంచి జనవరి 19వరకు సుప్రభాత సేవ, ఉదయం ఆరాధన టికెట్లు, ఈనెల 30 నుంచి జనవరి 19 వరకు సహస్రనామార్చన టికెట్లు రద్దు చేసినట్టు తెలిపారు.
16 నుంచి ధనుర్మాస ఉత్సవాలు ప్రారంభం
ధనుర్మాస ఉత్సవాలు ఈనెల 16న ప్రారంభమవుతాయని, ఆరోజు మధ్యాహ్నం 1.01 గంటకు సింహగిరిపై రాజగోపురంలో నెలగంట మోగిస్తారు. శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి, గోదాదేవికి విశేష పూజలు, తిరువీధి నిర్వహిస్తారు. తొలి పాశుర విన్నప పారాయణాన్ని నిర్వహిస్తారు. నెలగంట సందర్భంగా ఆరోజు ఉదయం 11.30 నుంచి మద్యాహ్నం 2.30 గంటల వరకు స్వామివారి దర్శనాలు లభించవు.
20 నుంచి పగల్‌పత్తు ఉత్సవాలు : ఈనెల 20 నుంచి 29 తేదీ వరకు పగల్‌పత్తు ఉత్సవాలు నిర్వహిస్తారు. ప్రతీ రోజూ ఉదయం తిరువీధి ఉత్సవం(అయ్యవారి సేవ) నిర్వహిస్తారు. ఆ రోజుల్లో ఆర్జిత సేవలన్నీ రద్దు చేశారు.
30 నుంచి రాపత్తు ఉత్సవాలు
ఈనెల 30 నుంచి జనవరి 9వ తేదీ వరకు రాపత్తు ఉత్సవాలు నిర్వహిస్తారు. ప్రతీ రోజూ సాయంత్రం 5 గంటలకు స్వామికి ఒక్కోరోజు ఒక్కో అలంకారంలో తిరువీధి నిర్వహిస్తారు. ఆయా రోజుల్లో రాత్రి 7 గంటల తర్వాత దర్శనాలు లభించవు.
జనవరి 11న కూడారై ఉత్సవం
జనవరి 11న ఆలయంలో కూడారై ఉత్సవం నిర్వహిస్తారు. ఉదయం 9 నుంచి 10.30 గంటల వరకు దర్శనాలు లభించవు.
14న గోదా రంగనాథుల కల్యాణోత్సవం
జనవరి 14న భోగి పర్వదినాన్ని పురస్కరించుకుని సాయంత్రం 5 నుంచి 6.30 గంటల వరకు గోదా రంగనాథుల కల్యాణోత్సవం నిర్వహిస్తారు. ఆరోజు నిత్యకల్యాణం ఉదయం లేకపోవడంతో సాయంత్రం ఉభయదాతలకు అవకాశం కల్పిస్తారు.


