విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ
రంపచోడవరం ఐటీడీఏ పీఓ స్మరణ్ రాజ్
రంపచోడవరం/ మారేడుమిల్లి : ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం మెనూ అమలు చేయాలని రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి స్మరణ్ రాజ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మారేడుమిల్లి మండలం కోడూరు బొడ్లంక గ్రామాలు, వై.రామవరం మండలం ఎగువ ప్రాంతంలోని ధారగడ్డ గుర్తేడు తదిత గ్రామాల్లో పీవో గురువారం పర్యటించారు. మారేడుమిల్లి మండలం కోడూరు గ్రామంలో పీఎం జన్‌మన్ పథకం ద్వారా మంజూరైన గృహాలను, నీటి కుంటలను పీవో పరిశీలించారు. బొడ్లంక గ్రామంలో పసుపు ప్రోసింగ్ చేసే పరికరం మరమ్మతులు చేయించాలని మహిళా సంఘాలు పీవో దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై పీఓ స్పందించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గుర్తేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పీఓ పరిశీలించారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. గుర్తేడు, ధారగడ్డ గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ ఉన్నత పాఠశాలను పరిశీలించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రోజు మెనూ అమలు చేసి విద్యార్థులకు ఎప్పటికప్పుడు తయారుచేసిన ఆహార పదార్థాలు అందించాలన్నారు. విద్యార్థుల ఆరోగ్యం, విద్యా ప్రగతిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. తంగేడు కోట నుండి రోడ్డు ఏర్పాటు చేయుటకు ప్రతిపాదనలు తయారుచేసి నివేదికల సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రాజెక్ట్ అధికారి వెంట ఎంపీడీవో ఎం.బాపన్న దొర, డిప్యూటీ ఇంజనీర్ చైతన్య, దుర్గాప్రసాద్, రామరాజు తదితరులు పాల్గొన్నారు.


