భూగర్భ జలవనరుల పరిరక్షణ అందరి బాధ్యత
పాడేరు : పూర్వీకులు ఆచరించిన ఆధ్మాత్మిక ధోరణిలో ప్రకృతిని పూజించి భూగర్భ జల వనరును పెంపొందించి పరిరక్షించడం అందరి బాధ్యత అని కలెక్టర్ దినేష్‌కుమార్ సూచించారు. బుధవారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో భారత ప్రభుత్వ కేంద్రీయ భూగర్భ జలమండలి దక్షిణ క్షేత్రం(హైదరాబాద్), ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభాగ కార్యాలయం(విశాఖపట్నం) సంయుక్తంగా రైతులు, ప్రజలతో చర్చాగోష్టి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో వర్షపాతం నమోదు, భూగర్భ జలాలను వినియోగించడంలో వెనుకబడుతున్నామన్నారు. దీనిని అధిగమించి జిల్లాలోని గ్రామాలకు తాగునీరు, సాగునీరు అందేంచే విధంగా జిల్లా భూగర్భ జల వనరుల శాఖ, ఆర్‌డబ్ల్యూఎస్, డ్వామా శాఖల సమన్వయంతో పని చేస్తోందన్నారు. తూర్పు కనుమల ద్వారా ఉత్తరాంధ్రలో లక్షలాది ఎకరాలకు సాగునీరు, వేలాది గ్రామాలకు తాగునీరు అందుతుందన్నారు. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. జిల్లాలో 22 మండలాల్లో వర్షపాతంలో లోటు లేకున్నా భవిష్యత్‌లో నీటి నిల్వ, నీటి నాణ్యతలను ఎలా కాపాడుకోవాలనే దానిపై జిల్లా యంత్రాంగం ప్రణాళికలను రూపొందిస్తుందన్నారు. జిల్లాలోని భూగర్భంలో నైట్రేట్, ఫ్లోరైడ్ నియంత్రణలోనే ఉందన్నారు. జిల్లా నీటి యాజమాన్య సంస్థ ద్వారా నీటి నిల్వల కోసం 254 చెక్‌డ్యాంలను నిర్మించడం జరిగిందన్నారు. ఇవే కాకుండా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా నీటి కుంటలు, పంట కుంటలు, నీటి ఊటలు తవ్వించడం జరిగిందని వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. గ్రామ సభల తీర్మానాల ద్వారా నీటి వనరులను కాపాడుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు రీజనల్ డైరెక్టర్ ఎం. జ్యోతికుమార్, అమెరికా ప్రతినిధి గోపాల్, సీజీడబ్ల్యూబీ శాస్త్రవేత్త లక్ష్మీనారాయణ దామోదర్, ఎస్‌ఎంఐ డీఈఈ ఆర్ నాగేశ్వరరావు, ఆర్‌డబ్ల్యూఎస్, డ్వామా అధికారులు, పలువురు రైతులు పాల్గొన్నారు.
కలెక్టర్ దినేష్‌కుమార్


