ఒక్కో సంస్థ ఒక్కో ధర.. రైతుకు టోకరా
సాక్షి,పాడేరు: మన్యంలో కాఫీ పండ్ల కొనుగోళ్లు ఊపందుకున్నాయి. ఎంతో కష్టపడి పండించిన రైతులకు మార్కెట్ పరిస్థితులు నిరాశ కలిగిస్తున్నాయి. సంస్థలు కొనుగోలు ధరల్లో వ్యత్యాసం ఉన్నందున తాము నష్టపోవాల్సి వస్తోందని గిరిజన రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నాయి. జిల్లాలోని 1.50 లక్షల ఎకరాల్లో కాఫీ సాగవుతోంది. ఎకరాకు కనీనం 1000 కిలోల వరకు ఫలసాయం వస్తుంది. ఈ ఏడాది దిగుబడి ఆశాజనకంగా ఉన్నా సంస్థలు నిర్ణయించిన కొనుగోలు ధరలు వారిని నిరాశ పరుస్తున్నాయి.
● పాడేరు ఐటీడీఏ ఆధీనంలోని చింతపల్లి మాక్స్ సంస్థ కాఫీ పండ్లు గ్రేడ్–1ను కిలో రూ.70, గ్రేడ్–2 కిలో రూ.65 ధరకు కొనుగోలు చేస్తోంది. ఐటీడీఏ కాఫీ విభాగ అధికార యంత్రాంగమంతా గ్రామాలకు నేరుగా గిరిజనుల కాఫీ తోటల వద్దకు వెళ్లి ఫలసాయం కొనుగోలు చేస్తోంది. ఈ సంస్థకే కాఫీ పండ్లు విక్రయించాలని అధికారుల నుంచి ఒత్తిడి తేవడం రైతులకు ఇబ్బందిగా మారింది. కాఫీ మార్కెటింగ్ తరువాత లాభాలను బోనస్ రూపంలో పంపిణీ చేస్తామని కాఫీ విభాగం అధికారులు గిరిజనులకు హమీ ఇస్తున్నారు. తక్కువ ధరకు చింతపల్లి మాక్స్ కొనుగోలు చేయడంతో కాఫీ రైతులు ఉసూరుమంటున్నారు.
రికార్డు ధరకు నాంధి కొనుగోలు
అరకులోయ కేంద్రంగా పనిచేస్తున్న నాంధి స్వచ్ఛం సంస్థ కాఫీ పండ్లు కిలో రూ.100 ధరకు కొనుగోలు చేస్తోంది. పూర్తిగా పండిన పండ్లు కిలో రూ.100, నాణ్యత తక్కువగా ఉంటే కిలో రూ.80నుంచి రూ.90కు కొనుగోలు చేస్తోంది. అయితే నాంధి సంస్థ అధిక ధరతో పోటాపోటీగా గ్రామాల్లో తిరుగుతున్నప్పటికీ రైతులు పూర్తిస్థాయిలో అమ్ముకోలేకపోతున్నారు. చింతపల్లి మాక్స్‌కే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులు ఒత్తిడి చేస్తున్నందున కిలోకు రూ.30 చొప్పున నష్టపోవాల్సి వస్తుందని కాఫీ రైతులు వాపోతున్నారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాలు కూడా కిలో కాఫీ పండ్లను రూ.70 ధరకు కొనుగోలు చేస్తున్నాయి.
కలెక్టర్, ఐటీడీఏ స్పందించాలి
లాభాలు, బోనస్‌ను పక్కనబెట్టి పాడేరు ఐటీడీఏ కిలో కాఫీ పండ్లకు 100 చెల్లించాలి. నాంధి సంస్థ మాదిరిగా కొనుగోలు చేయకుంటే నష్టపోవాల్సి ఉంటుంది. కలెక్టర్, ఐటీడీఏ అఽధికారులు స్పందించి మాక్స్ సంస్థ ధర పెంచేలా చర్యలు తీసుకోవాలి. – రేగం చిట్టన్న,
కాఫీ రైతు, వనుగుపల్లి పంచాయతీ
కాఫీ కొనుగోళ్లలో ఇష్టానుసారం
ప్రభుత్వ రంగ మాక్స్ కిలో రూ.70కు కొనుగోలు
ఈ సంస్థకే అమ్మాలని కాఫీ విభాగం అధికారుల ఒత్తిడి
ప్రైవేట్ సంస్థ నాంథి రూ.100 చెల్లింపు
రైతు ఉత్పత్తిదారుల సంఘాలు రూ.70కు సేకరణ
ధరల వ్యత్యాసంతో నష్టపోతున్న
కాఫీ రైతులు
ఒక్కో సంస్థ ఒక్కో ధర.. రైతుకు టోకరా


