అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం
అరకులోయ టౌన్: కోటి సంతకాల సేకరణ ప్రతులను ఈనెల 15న జిల్లా కేంద్రం నుంచి విజయవాడ తరలించే సందర్భంగా నిర్వహించే ర్యాలీకి నియోజకవర్గం నుంచి భారీ స్థాయిలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు హాజరు కావాలని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం పిలుపునిచ్చారు. బుధవారం అరకులోయ నుంచి కోటి సంతకాల ప్రతులను జిల్లా కేంద్రమైన పాడేరు తరలింపును ఆయన ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో కోటి సంతకాల సేకరణలో భాగంగా 60 వేల మందితో సంతకాలు చేయించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. అనివార్య కారణాల వల్ల 53 వేల సంతకాలు సేకరించామన్నారు. వీటిని ఈ రోజు జిల్లా కేంద్రంలో పార్టీ అధ్యక్షుడు విశ్వేశ్వరరాజుకు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పార్టీ పార్లమెంట్ పరిశీలకుడు బొడ్డేడ ప్రసాద్ మాట్లాడుతూ పేదకు వైద్యం అందించడం ప్రభుత్వ బాధ్యత అన్నారు. గతంలో అరకు, పాడేరు ప్రాంతానికి చెందిన వారు అనారోగ్యానికి గురైతే విశాఖ కేజీహెచ్‌కు తరలించే క్రమంలో మార్గమధ్యలో మృతి చెందేవారని గుర్తుచేశారు. పేదలకు పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందించాలన్న సంకల్పంతో గత ప్రభుత్వంలో అప్పటి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కొత్త 17 వైద్య కళాశాలను నిర్మించారన్నారు.వీటిలో ఏడు వైద్య కళాశాలలతోపాటు 500 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తే, టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రైవేట్ పరం చేసిందన్నారు. గడిచిన ఎన్నికల్లో టీడీసీ అభ్యర్థులకు నిధులు సమకూర్చిన వారికి ప్రజా ధనంతో నిర్మించిన వైద్య కళాశాలలను అప్పజెప్పారన్నారు. టీడీపీ నేతల మాయమాటలు నమ్మి మైదాన ప్రాంత ప్రజలు వారికి ఓటేస్తే, గిరిజన బిడ్డలు జగనన్నకు నమ్ముకొని ఉన్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో జగనన్న ముఖ్యమంత్రి అవుతారని, దేశమంతా అరకు వైపు చూసేలా మరింత అభివృద్ధి చేస్తారన్నారు. ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర మాట్లాడుతూ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను ఆపాలన్న సంకల్పంతోనే కోటి సంతకాల సేకరణ బాధ్యతను జగనన్న అప్పగించారన్నారు. నియోజకవర్గంలో మిగిలిన 7వేల సంతకాలు కూడా పూర్తి చేస్తామన్నారు. కోటి సంతకాల సేకరణ చేసిన పత్రాలను పాడేరు జిల్లా కేంద్రానికి తరలించే వాహనాన్ని బొడ్డేటి ప్రసాద్ జెండా ఊపి ప్రారంభించారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీగా ర్యాలీ నిర్వహించారు.అక్కడి నుంచి పాడేరు తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర ఎస్టీ సెల్ మహిళా విభాగం అధ్యక్షురాలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, అరకు అసెంబ్లీ పరిశీలకుడు సత్యారావు, జెడ్పీటీసీ శెట్టి రోషిణి, ఎస్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాంగి చిన్నారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి శెట్టి అప్పాలు, యువజన నాయకుడు రేగం చాణక్య, ఎంపీపీ శెట్టి నీలవేణి, వైస్ ఎంపీపీలు కిల్లో రామన్న, శెట్టి ఆనంద్, ఎంపీటీసీలు దురియా ఆనంద్‌కుమార్, రామచందర్, ఉమ్మడి విశాఖ జిల్లా ఎస్టీ సెల్ మాజీ అధ్యక్షుడు కమిడి అశోక్, పార్టీ మండల అధ్యక్షులు రామూర్తి, పరశురాం అనిల్, సూర్యనారాయణ, ఉపాధ్యక్షులు పల్టాసింగ్ విజయ్‌కుమార్,ప్రకాష్, సర్పంచ్‌లు నాగేశ్వరరావు, రమేష్, సుశ్మిత, రాధిక, కిముడు హరి, నాయకులు సింహాచలం, కృష్ణారావు, చందు పాల్గొన్నారు.


