బలిమెల నీటి వినియోగంపై సమీక్ష
● వేసవిలో విద్యుత్ ఉత్పత్తికి ఇబ్బందులు లేకుండా సమష్టిగా చర్యలు
● నిర్ణయించిన ఇరు రాష్ట్రాల అధికారులు
సీలేరు : ఆంధ్రా ఒడిశా ఉమ్మడి నిర్వహణలో ఉన్న బలిమెల జలాశయం నీటి వినియోగం, నిర్వహణపై ఇరు రాష్ట్రాల అధికారులు బుధవారం ఒడిశాలోని చిత్రకొండలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా 2025– 26 నీటి సంవత్సరంలో 2025 జూలై నుంచి నవంబరు 30 వరకు ఇరు రాష్ట్రాల వినియోగించుకున్న నీటిపై లెక్కలు కట్టారు. దీని ప్రకారం ఆంధ్రా ఇప్పటి వరకు 20,3513 టీఎంసీలు, ఒడిశా 48.8470 టీఎంసీలు వాడుకున్నట్టుగా వారు వెల్లడించారు. ప్రస్తుతం బలిమెల జలాశయంలో 78.4000 టీఎంసీలు, జోలాపుట్టులో 28.5451 టీఎంసీలు కలిసి మొత్తంగా 106,9451 టీఎంసీల నిల్వలు ఉన్నట్టు తెలిపారు. ఈ నెలఖరు నాటికి పరివాహక ప్రాంతాల నుంచి బలిమెల జలాశయానికి 3.5000 టీఎంసీలు, జోలాపుట్టుకు 25000 టీఎంసీలు అదనపు నీరు చేరే అవకాశం ఉన్నందున రెండింటిలో మొత్తం112.9451 టీఎంసీలు నిల్వలు ఉండనున్నట్టు అంచనాతో లెక్కలు కట్టారు. ఇందులో ఆంధ్రాకు 69.0803, ఒడిశాకు 43.8648 టీఎంసీలుగా పంపకాలు జరిపారు. ప్రస్తుతం గ్రిడ్ డిమాండ్, ఇరిగేషన్ అవసరాల నిమిత్తం ఆంధ్రాకు రెండు వేల క్యూసెక్కులు, ఒడిశా మూడు వేల క్యూసెక్కులు వాడుకునేందుకు ఇరు రాష్ట్రాల అధికార్ల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ కార్యక్రమంలో ఒడిశా తరఫున పోట్టేరు ఇరిగేషన్ చీఫ్ కనస్ట్రక్చన్ ఇంజనీర్ కృష్ణకుమారి పాత్రో, చిత్రకొండ ఎర్త్ డ్యాం డివిజన్ ఎస్‌ఈ రమాకాంత్, పొట్టేరు కెనాల్ డివిజన్ ఎస్‌ఈ సనోజ్, బలిమెల ఓహెచ్‌సీ మేనేజర్ బిమల టర్కీ, డిప్యూటీ మేనేజర్ క్లుణిష చంద్రబెహరా, అసిస్టెంట్ మేనేజర్ సుదీప్, ఆంధ్రా తరఫున సీలేరు కాంప్లెక్సు సివిల్ ఎస్‌ఈ చిన్న కామేశ్వరరావు, ఈఈ ఎస్ జైపాల్ తదితరులు పాల్గొన్నారు.


