విభిన్న ప్రతిభావంతులపై చిన్నచూపు తగదు
పాడేరు : విభిన్న ప్రతిభావంతుల పట్ల చిన్నచూపు తగదని, వారిని అన్ని రంగాల్లో ప్రోత్సహించాలని కలెక్టర్ దినేష్‌కుమార్ కోరారు. అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని బుధవారం పట్టణంలోని కాఫీ హౌస్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ దినేష్‌కుమార్ మాట్లాడుతూ జిల్లాలో విభిన్న ప్రతిభావంతులకు నిర్ధేశించిన ఉద్యోగాలను అన్ని శాఖల నుంచి వెరిఫికేషన్ కొరకు రాష్ట్ర ప్రభుత్వానికి పంపి అనుమతులు పొందామన్నారు. ఖాళీగా ఉన్న పోస్టుల వారీగా నోటిఫికేషన్ విడుదలకు ఆదేశాలు జారీ చేశామన్నారు. స్వయం ఉపాధి పథకాల ద్వారా ప్రభుత్వం నుంచి రాయితీతో కూడిన రుణాలు మంజూరు చేస్తామన్నారు. పెన్షన్ తీసుకుంటున్న వారి సమాచారంతో పాటు జిల్లాలో మొత్తం దివ్యాంగుల వివరాలు సేకరించాలని అధికారులను ఆదేశించారు. విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఆటల పోటీల్లో విజేతలకు బహుమతులు, దివ్యాంగుల అసోసియేషన్ సభ్యులకు జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జీ జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ, అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్, జిల్లా ప్రతిభావంతుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కె. కవిత, రెడ్‌క్రాస్ ప్రతినిధులు జయ, ఐసీడీఎస్ పీడీ ఝాన్షీరామ్ పడాల్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ దినేష్‌కుమార్


