హైవే పనుల్లో నిర్లక్ష్యం.. బాలికకు గాయాలు
జి.మాడుగుల: జాతీయ రహదారి నిర్మాణ పనులు చేపడుతున్న కాంట్రాక్టురుల నిర్లక్ష్యం వలన పనులు అసంపూర్తిగా వదిలిపెట్టడంతో అనేక మంది గిరిజన ప్రజలు గాయపడుతున్నారు. రోడ్డు మార్గంలో నిర్మాణాల పేరుతో రోడ్డు తవ్వటం వదిలి పెట్టటం, డ్రైనేజీ పనులు నిమిత్తం పెద్దపెద్ద గోతులు తవ్వటం పూర్తి చేయకపోవటం, సిమెంట్ డ్రైనేజీలపై పైకప్పులు వేయకపోవటం వంటి కారణాల వలన అనేక మంది గాయాలపాలవుతున్నారు. మండలంలో గాంధీనగరం గ్రామంలో హైవే కాంట్రాక్టర్ డ్రైనేజీపై పైకప్పు వేయకపోవడంతో అదే గ్రామానికి చెందిన గిరిజన బాలిక గోతిలో పడిపోయి కుడికాలుకు తీవ్రగాయమైనట్టు గ్రామస్తులు తెలిపారు. ఇటీవల బందవీధి గ్రామంలో గిరిజన యువకుడు కాలువలో పడడంతో కాలు విరిగిపోయిందని వారు తెలిపారు. హైవే అధికారుల పర్యవేక్షణ లోపం, పనులు చేస్తున్న కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వలన ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయని తక్షణమే పనులు పూర్తి చేయాలని సమరసతా సేవా ఫౌండేషన్ జిల్లా ప్రముఖ్ మత్స్యరాస మత్స్యరాజు డిమాండ్ చేశారు. హైవే పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారిపై కలెక్టర్ చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. జాతీయ రహదారి నిర్మాణ పనులు జాప్యం చేస్తూ నిర్లక్ష్యం చేస్తూ ప్రమాదాలకు కారమణమవుతున్న అధికారులు, సంబంధిత కాంట్రాక్టర్లుపై కేసులు పెడతామని హెచ్చరించారు.


