ఎకో ఆదాయం.. ఇష్టారాజ్యం
కానరాని కమ్యూనిటీ బేస్డ్ ఎకో టూరిజం ప్రయోజనం
గిరిజన గ్రామాల అభివృద్ధికి కనిపించని నిధుల కేటాయింపు
అటవీశాఖ తీరుపై విమర్శలు
రూ.లక్షలు ఏమవుతున్నాయని పుల్లంగి పంచాయతీ గిరిజనుల ఆవేదన
అటవీశాఖ తీరును వ్యతిరేకిస్తూ పీసా గ్రామసభలో తీర్మానం
రంపచోడవరం డివిజన్ మారేడుమిల్లి ఏజెన్సీలో పర్యాటకంగా అటవీశాఖకు భారీగా ఆదాయం సమకూరుతున్నా తమ గ్రామాలకు ఎటువంటి మేలు జరగడం లేదని గిరిజనులు ఆరోపిస్తున్నారు. పర్యాటకుల నుంచి వచ్చిన ఆదాయంలో నిబంధనల ప్రకారం కొంత గిరిజన గ్రామాల అభివృద్ధికి ఖర్చుచేస్తామని అటవీశాఖ చెప్పినప్పటికీ అందులో వాస్తవం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిధులు ఇష్టారాజ్యంగా ఖర్చు చేస్తూ కాకిలెక్కలు చెబుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.
రంపచోడవరం:
అటవీశాఖ మారేడుమిల్లి కేంద్రంగా కమ్యూనిటీ బేస్డ్ ఎకో టూరిజం (సీబీఈటీ) నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా మారేడుమిల్లి, వాలమూరులో కాటేజీలు నిర్వహిస్తోంది. ఏజెన్సీ ప్రాంతానికి వచ్చే పర్యాటకులు ఆన్‌లైన్‌లో వీటిని బుక్ చేసుకోవచ్చు. వీటి నిర్వహణ బాధ్యతలను సీబీఈటీ సభ్యులు పర్యవేక్షిస్తున్నారు.
●గుడిసె టూరిజంను అటవీశాఖ నిర్వహిస్తోంది. ఆకుమామిడి కోట వద్ద పుల్లంగి రోడ్డులో చెక్‌పోస్టు ఏర్పాటుచేసి గుడిసెకు వెళ్లే పర్యాటకుల వాహనాల నుంచి టికెట్ రూపంలో వసూలు చేస్తోంది. ఈ మొత్తంలో కొంత భాగం గ్రామాల అభివృద్ధికి ఖర్చు చేయాల్సి ఉంది. అయితే ఈ నిధులు పథకం ప్రకారం అటవీశాఖ అధికారులు పక్కదారి పట్టిస్తున్నారని గిరిజనులు ఆరోపిస్తున్నారు.
●అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గుడిసె పర్యాటకాన్ని మారేడుమిల్లి మండలం పుల్లంగి పంచాయతీ పరిధిలోని పాములమామిడి, గుడిసె, చెలకవీధి గిరిజనులు వ్యతిరేకిస్తున్నారు. ఈ మేరకు పీసా గ్రామసభలో ఎంపీటీసీ సభ్యురాలు బున్నమ్మ, అందాల మంగిరెడ్డి, సాదల సోమిరెడ్డి, మాజీ సర్పంచ్‌లు పీసా కమిటీ ఉపాధ్యక్షులు, కార్యదర్శులు రవీంద్రరెడ్డి, లింగారెడ్డి,రత్నారెడ్డి, సాదల కొమ్మిరెడ్డి, సీబీటీ సభ్యుడు కోండ్ల చిన్నారెడ్డి, గిరిజనులు ఏకగ్రీవంగా తీర్మానించారు. గుడిసె పర్యాటక ప్రాంతం పేరు చెప్పి రూ.లక్షలు అటవీశాఖ దండుకుంటోందని వారు ఆవేదన వ్యక్తంచేశారు. గ్రామాలకు ఎటువంటి ఉపయోగం లేదన్నారు. అధికారుల ఒప్పందం ప్రకారం వాటర్ ట్యాంకు, రోడ్లు, గ్రామాల అభివృద్ధి పట్టించుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో ఐటీడీఏ కూడా గ్రామంలో పాఠశాల భవనం ఏర్పాటు చేయలేకపోయిందని విమర్శించారు.
●అటవీశాఖ ఆధ్వర్యంలో కమ్యూనిటీ బేస్డ్ ఎకో టూరిజం ఏర్పాటు చేసి సుమారు 17 ఏళ్లు అవుతోంది. అప్పటి నుంచి సీబీఈటీకి వచ్చిన ఆదాయానికి సంబంధించి ఎటువంటి అడిట్ నిర్వహించలేదన్న విమర్శలు ఉన్నాయి. నిబంధనల ప్రకారం ఏటా అడిట్ నిర్వహించి వచ్చిన ఆదాయంలో సీబీఈటీ సభ్యులకు ఇచ్చిన మొత్తం, జలతరంగణి, అమృతధార, కాటేజీల నిర్వహణకు ఖర్చు చేసిన వివరాలు వెల్లడించాల్సి ఉంది. కానీ ఏళ్ల తరబడి ఆడిట్ జరగలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చని వారు ఆరోపిస్తున్నారు.
●గుడిసె పర్యాటక ప్రాంతానికి ఏటా వేల సంఖ్యలో పర్యాటకుల వస్తున్నారు. అటవీ శాఖ ఏర్పాటు చేసిన చెక్ పోస్టు ద్వారా ఒకరికి రూ.100, ద్విచక్ర వాహనానికి రూ. 100, నాలుగు చక్రాల వాహనానికి రూ. 300 వసూలు చేస్తున్నారు.
ఈ మాదిరిగానే జలతరంగని, అమృతధార సందర్శనకు వచ్చే పర్యాటకుల నుంచి టికెట్ రూపంలో వసూలు చేస్తున్నారు. వీటితోపాటు అలాగే కాటేజీల ద్వారా ఆదాయం వస్తోంది. ఇందుకు సంబంధించి అటవీ అధికారులు అడిట్ నిర్వహించక పోవడం, వచ్చిన ఆదాయంతో కొంత భాగాన్ని గ్రామాల అభివృద్ధికి ఖర్చు చేయకపోవడం విస్మయం కలిగిస్తోంది.
ఎకో ఆదాయం.. ఇష్టారాజ్యం


