ఉద్యమ స్ఫూర్తితో కోటి సంతకాల సేకరణ
విజయవంతంగా నిర్వహణ
అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం
భారీ ర్యాలీ నిర్వహించి పార్టీ జిల్లా అధ్యక్షుడు విశ్వేశ్వరరాజుకు అందజేస్తామని వెల్లడి
అరకులోయ టౌన్: వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నియోజకవర్గంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం విజయవంతంగా జరిగిందని స్థానిక ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. మంగళవారం తన క్యాంప్ కార్యలయంలో నియోజకవర్గంలోని పార్టీ నాయకులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. పేదలకు మెరుగైన వైద్యం పేద విద్యార్థులకు వైద్య విధ్య అందించాలన్న సంకల్పంతో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో 17 వైద్య కళాశాలలను ఏర్పాటు చేశారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వీటిని ప్రయివేటు పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ జగన్‌మోహన్ రెడ్డి రాష్ట్రంలో కోటి సంతకాల సేకరణకు పిలుపునిచ్చారన్నారు. గడిచిన నెల రోజులపాటు నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు రచ్చబండ నిర్వహించి కోటి సంతకాల సేకరణను దిగ్విజయంగా పూర్తి చేశారన్నారు. వీటిని ఈనెల 10వ తేదీ బుధవారం భారీ ర్యాలీ నిర్వహించి జిల్లా కేంద్రానికి తరలించి పార్టీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్యరాస విశ్వేశ్వరరాజుకు అందజేస్తామని తెలిపారు. నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. కూటమి ప్రభుత్వ అనాలోచిత కారణాల వల్ల పేదలకు మెరుగైన వైద్యం, పేద విద్యార్థులకు వైద్య విద్య అందని ద్రాక్షగా మారిందన్నారు. ప్రభుత్వమే వైద్య కళాశాలలను నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. వైద్య కళాశాలలు పూర్తయి, తరగతులు నిర్వహిస్తే జగన్‌మోహన్ రెడ్డికి మంచి పేరు వస్తుందని చంద్రబాబు అండ్‌కో కుట్ర చేస్తోందని విమర్శించారు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం వైద్య కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని విరమించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఎస్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాంగి చిన్నారావు. జిల్లా ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి శెట్టి అప్పాలు, యువజన నాయకుడు రేగం చాణక్య, ఉమ్మడి విశాఖ ఎస్టీ సెల్ మాజీ అధ్యక్షుడు కమిడి అశోక్, వైస్ ఎంపీపీలు కిల్లో రామన్న, శెట్టి ఆనంద్, ఎంపీటీసీలు దురియా ఆనంద్‌కుమార్, స్వాభి రామచందర్, కూడ పాపారావు, ఎస్టీ సెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నరశింహా మూర్తి, సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు కిముడు హరి, సర్పంచ్‌లు పెట్టెలి సుస్మిత, మాదల బుటికి, పార్టీ మండల అధ్యక్షులు స్వాభి రామూర్తి, పాంగి అనిల్, ఉపాద్యాక్షులు పల్టాసింగ్ విజయ్ కుమార్, ప్రకాష్‌రావు, బూత్ కమిటీ ఇన్‌చార్జి పాంగి విజయ్‌కుమార్, వార్డు సభ్యుడు శివ, పార్టీ నాయకులు కొర్రా అర్జున్, కిరణ్‌కుమార్, నాగేశ్వరరావు, శంకర్, మోహన్, ప్రసాద్ పాల్గొన్నారు.


