కొత్తగా లక్ష ఎకరాల్లో కాఫీ సాగు
చింతపల్లి: జిల్లాలో రానున్న ఐదేళ్లలో కొత్తగా లక్ష ఎకరాల్లో రూ.222 కోట్ల వ్యయంతో కాఫీ తోటల విస్తరణకు భారీ ప్రణాళిక అమలు చేయనున్నట్టు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరి ఎం.ఎం.నాయక్ తెలిపారు. మంగళవారం ఆయన మండలంలో పర్యటించారు. ముందుగా తాజంగిలో నిర్మాణ దశలో ఉన్న గిరిజన స్వాతంత్ర సమరయోథుల మ్యూజియం నిర్మాణ పనులను పరిశీలించారు. బిర్సాముండా జయంతి నాటికే మ్యూజియం పనులు పూర్తిచేయాలని భావించామన్నారు. వివిధ కారణాల వల్ల నిర్మాణాల్లో జాప్యం జరిగిందన్నారు. జనవరి 15 నాటికి పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం చింతపల్లి వచ్చిన ఆయన ఐటీడీఏ ఆధ్వర్యంలో మాక్స్ నిర్వహిస్తున్న కాఫీ పల్పింగ్ యూనిట్‌ను పరిశీలించారు. ఈఏడాది 1,600 మెట్రిక్ టన్నుల కాఫీ పండ్ల సేకరణ లక్ష్యం పూర్తిచేయాలని భావిస్తున్నట్టు ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ వివరించారు.ఈ ఏడాది కిలో కాఫీ పండ్ల ధర మేలు రకం కిలో రూ.70 రెండో రకం రూ.60గా ఐటీడీఏ పెంచినట్టు పీవో తెలిపారు.ఐటీడీఏ ఆధ్వర్యంలో ప్రారంభించి అసంపూర్తిగా ఆగిపోయిన జి.మాడుగుల, గూడెంకొత్తవీధి పల్పింగ్‌కేంద్రాల నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆమెను నాయక్ ఆదేశించారు. త్వరలో టెండర్ల ప్రక్రియ పూర్తిచేస్తామన్నారు. ఈకార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ ఈఎన్‌సీ వసంత, టీసీఆర్, టీఎం ఈడీ మందరాణి, గిరిజన సంక్షేమశాఖ ఏపీఓ వెంకటేశ్వరరావు, కాఫీ ఏడీ బొంజుబాబు, ఈఈ డేవిడ్‌రాజు, డీఈఈ రఘునంథనరావునాయుడు, జేఈ యాదకిశోర్ మ్యాక్స్ అధ్యక్షుడు సింహాచలం, కోశాధికారి గోవిందు, ఏఈవో ధర్మారాయ్ తదితరులు పాల్గొన్నారు.
కొత్తగా లక్ష ఎకరాల్లో కాఫీ సాగు


