డౌన్‌హిల్ స్కేటింగ్‌లో తమిళనాడు సత్తా
విశాఖ స్పోర్ట్స్ : జాతీయ రోలర్ స్కేటింగ్ చాంపియన్‌షిప్‌లో భాగంగా మంగళవారం తొట్లకొండలో జరిగిన డౌన్‌హిల్ స్కేటింగ్ పోటీల్లో తమిళనాడు జట్టు సత్తా చాటింది. మెన్‌లో కిషోర్‌కృష్ణ విజేతగా నిలిచి స్వర్ణాన్ని అందుకోగా హర్షిత్ ద్వితీయ స్థానంతో (వీరిద్దరూ తమిళనాడు) రజతాన్ని అందుకున్నాడు. సాయంత్(కేరళ) తృతీయ స్థానంలో నిలిచి కాంస్యాన్నందుకున్నాడు. వుమెన్‌లో వర్షిణి విజేతగా నిలిచి స్వర్ణాన్ని అందుకోగా అమిజిధాని(వీరిద్దరూ తమిళనాడు) ద్వితీయ స్థానంలో నిలిచి రజతాన్ని అందుకుంది. ఆర్.వి.రమ్యశ్రీ(ఆంధ్రప్రదేశ్) తృతీయ స్థానంలో నిలిచి కాంస్యాన్ని సొంతం చేసుకుంది. 15–18 ఏళ్ల బాలుర విభాగంలో గురుహర్షన్(తమిళనాడు), వష్ణావ్ లీమిన్(కేరళ), ఆరవ్ శ్రీజిత్(తమిళనాడు) వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలవగా.. బాలిక విభాగంలో శృతి(తమిళనాడు), అక్షర(తమిళనాడు), ఎం.ఐశ్వర్య(ఆంధ్రప్రదేశ్) తొలి మూడు స్థానాల్లో నిలిచారు.
లాంఛనంగా స్కేటింగ్ పోటీలు ప్రారంభం
జాతీయ రోలర్ స్కేటింగ్ చాంపియన్‌షిప్‌ను మంగళవారం వీఎంఆర్‌డీఏ పార్క్‌లో లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో కలెక్టర్ హారేందిర ప్రసాద్, జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్, వీఎంఆర్‌డీఏ కమిషనర్ తేజ్ భరత్, శాప్ చైర్మన్ రవినాయుడు, ప్రభుత్వ విప్ పివిజిఆర్ నాయుడు, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, స్కేటింగ్ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. అంతర్జాతీయ స్కేటర్ ఆనంద్‌కుమార్‌ను సత్కరించి నగదు ప్రోత్సాహకాన్ని అందించారు.


