వసతి గృహ విద్యార్థినులపై కోతుల దాడి
రావికమతం: స్థానిక ఎస్సీ బాలికల వసతి గృహంలో విద్యార్థినులకు రక్షణ కొరవడింది. ఆదివారం రాత్రి హాస్టల్‌లోకి కోతులు ప్రవేశించి ఇద్దరు విద్యార్థినులను గాయపరిచాయి. రావికమతం మెయిన్ రోడ్డుకు దగ్గరలో ఎస్సీ, బీసీ హాస్టళ్లు ఉన్నాయి. ఎస్సీ హాస్టల్‌లో 96 మంది విద్యార్థినులు ఉంటున్నారు. వీరిలో పాల్లికలిక స్నేహ, సేదరి మంగలపై కోతులు దాడి చేయడంతో స్పల్పంగా గాయపడ్డారు. హాస్టల్ సిబ్బంది ఈ విషయాన్ని గోప్యంగా ఉంచి, వారిద్దరికి స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రాథమిక వైద్యం అందించి నర్సీపట్నం తరలించారు. అక్కడ మెరుగైన చికిత్స అనంతరం బాలికలను వారి తల్లిదండ్రులు సోమవారం ఇళ్లకు తీసుకెళ్లారు. అక్టోబర్‌లో బీసీ హాస్టల్‌లోకి కుక్కలు ప్రవేశించి రాత్రి సమయంలో 12 మంది బాలికలపై దాడి చేశాయి. ఈ హాస్టల్‌కు రక్షణ గోడ ఏర్పాటు చేయలేదు. ఇప్పటికై నా అధికారులు స్పందించి బాలకలకు రక్షణ కల్పించాలని ఆదివాసీ గిరిజన సంఘం అధ్యక్షుడు గెమిల వాసు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి గోవిందరావు, కేవీపీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి సూరిబాబు, డప్పు కళాకారుల సంఘం అధ్యక్షుడు ఎత్తుల రాజు డిమాండ్ చేశారు. కోతుల దాడి విషయమై మేట్రిన్ లలితను వివరణ కోరగా, అటవీ శాఖ, సాంఘిక సంక్షేమ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు.
కోతుల దాడిలో గాయపడిన
విద్యార్థినులు స్నేహ, మంగ
వసతి గృహ విద్యార్థినులపై కోతుల దాడి


