ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన అవసరం
అరకులోయటౌన్: మండలంలోని చినలబుడు పంచాయతీ గొందివలస గ్రామంలో బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమం ద్వారా అర్థసూత్ర సంబాద్ అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాంది ఫౌండేషన్ ప్రతినిధి ఆర్.వెంకటరావు మాట్లాడారు. గిరిజన ప్రాంతంలో ఆర్థిక సాధికారతకు దేశ వ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఆర్‌బీఐ ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యతను పెంపొందించేందుకు చేపట్టిన కార్యక్రమంలో భాగంగా బ్యాంకింగ్ సౌకర్యాలు తక్కువగా ఉన్న మారుమూల గ్రామాల్లో ఆర్ధిక చేరువను పెంపొందించడమే లక్ష్యమన్నారు. ఇందులో భాగంగా ఆర్థిక మోసాలపై అవగాహన పెంచి, డబ్బు నిర్వహణలో మంచి పద్ధతుల గురించి ప్రజలకు మార్గనిర్ధేశం చేస్తున్నామన్నారు. డిప్యూటి తహసీల్దార్ పంచాడి గోవింద్ మాట్లాడుతూ ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన లేకపోవడంతో మోసాలబారిన పడే అవకాశాలుంటాయన్నారు. పొదుపు, బ్యాంకింగ్ లావాదేవీలపై అవగాహన కల్పించారు. సర్పంచ్ ఉపేంద్ర, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.


