కనువిందుగా కొండగుడి పండగ
డాబాగార్డెన్స్ : పాతపోస్టాఫీస్ ప్రాంతంలోని రాస్‌హిల్స్ కొండపై వెలసిన అమలోద్బవి అమ్మవారిని దర్శించుకోవడానికి సోమవారం అశేష భక్తజనం తరలివచ్చింది. భక్తి పారవశ్యంతో మాతను స్మతిస్తూ.. ఆరాధకుల గీతాలాపనలు.. సర్వమానవ సౌభ్రాతృత్వం కోసం అగ్ర పీఠాధిపతుల బోధనలు.. ఇలా అక్కడ అణువణువునా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఉత్తరాంధ్రతో పాటు ఉభయ గోదావరి, కృష్ణ జిల్లాల నుంచి అమ్మ కరుణ కోసం తరలివచ్చిన ఆరాధకులతో విశాఖ జనపురిగా మారిపోయింది. కుల, మతాలకు అతీతంగా అమ్మవారిని దర్శించుకోవడంతో పరమత సహనం పరిఢవిల్లింది.
భక్తిశ్రద్ధలతో దివ్యపూజా బలి
కొండగుడిలో వెలసిన అమలోద్బవి మాత(విశాఖ పురి మేరీమాత) ఉత్సవాలు గత నెల 29న ప్రారంభమయ్యాయి. డిసెంబర్ 8 సోమవారంతో ఉత్సవాలు ముగిశాయి. సోమవారం ఉదయం దివ్య పూజ జరిపారు. పూజలో ఎక్కువ మంది కన్యసీ్త్రలు రాష్ట్ర నలుమూలల నుంచి హాజరై ప్రార్థనలు చేశారు. ఉదయం 7.30 గంటలకు గుహవద్ద విశాఖ అగ్రపీఠాధిపతి డాక్టర్ ఉడుముల బాల సమిష్టి దివ్యబలి పూజ ప్రసంగమిచ్చారు. 350 మంది వలంటీర్లు, 50 మంది గురువులే గాక నగరంలోని వివిధ చర్చిలకు చెందిన ఫాదర్‌లు, బ్రదర్స్ ఈ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో చేపట్టారు.
వెల్లువలా ఊరేగింపు
మధ్యాహ్నం పాతపోస్టాఫీస్ వద్ద ఉన్న సెయింట్ అలెయిసిస్ పాఠశాల నుంచి ఆరాధకులు ప్రదక్షిణగా కొండపై ఉన్న ప్రధాన దేవాలయానికి చేరుకున్నారు. ఆరాధకుల సందర్శనార్ధం ఆలయం బయట అమలోద్బవి స్వరూపాన్ని ఉంచారు. ఆరాధకులు అమ్మవారికి తమ శక్తి మేరకు బంగారం, వెండి కానుకలు సమర్పించుకున్నారు. కొంత మంది తలనీలాలు సమర్పించి తమ భక్తి తత్పరతను చాటుకున్నారు. లూర్ధుమాత గుహ వద్ద దివ్యపూజ బలితో మహోత్సవం ముగిసింది.
జోరుగా వ్యాపారం
పాతపోస్టాఫీసు, కోటవీధి, ఫెర్రీరోడ్డు, అంబుసరంగ్ వీధి, కన్వేయర బెల్ట్ తదితర ప్రాంతాల్లో సుమారు కిలోమీటర్ల మేర దుకాణాలు వెలిశాయి. వీటిలో ఆధ్యాత్మిక గ్రంథాలు, కొండగుడి చరిత్ర, ఏసుక్రీస్తు, మేరిమాత బొమ్మలు కొలువుదీరాయి. వీటితో పాటు మిఠాయిలు, శనగలు, కర్జూరం వ్యాపారం జోరుగా సాగింది. కొవ్వొత్తుల వ్యాపారం ఎక్కువగా సాగింది.
కనువిందుగా కొండగుడి పండగ
కనువిందుగా కొండగుడి పండగ
కనువిందుగా కొండగుడి పండగ


