పాఠశాలలపై ప్రత్యేక పర్యవేక్షణ
రంపచోడవరం ఐటీడీఏ పీవో స్మరణ్‌రాజ్
రంపచోడవరం: ఏజెన్సీలో విద్యార్థులు బాగా చదువుకునే విధంగా సీఆర్పీలు ఎప్పటికప్పుడు మండలాల వారీగా పాఠశాలలను పరిశీలించి పర్యవేక్షించాలని రంపచోడవరం ఐటీడీఏ పీవో బచ్చు స్మరణ్‌రాజ్ అన్నారు. రంపచోడవరం పీఎంఆర్‌సీలో డీడీ రుక్మాండయ్య, ఏజెన్సీ డీఈవో వై.మల్లేశ్వరరావు, వివిధ శాఖల అధికారులతో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు పీవో మాట్లాడుతూ ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో పాఠాలు బోధించాలన్నారు. ఈ ఏడాది పదో తరగతిలో నూరుశాతం ఫలితాలు సాధించే దిశగా వంద రోజులు ప్రోగ్రాం అమలు చేయాలన్నారు. బేస్‌లైన్ టెస్టుకు సంబంధించిన విషయాలపై చర్చించారు. చదువులో బాగా వెనుకబడి విద్యార్థులను ఏ గ్రేడ్‌కు వచ్చే విధంగా శిక్షణ ఇవ్వాలన్నారు. సీఆర్పీలు పాఠశాలలను పరిశీలించి ఎప్పకప్పుడు నివేదికలు ఇవ్వాలన్నారు. ప్రతీ మండలంలోని గ్రామాల్లో బడిబయట పిల్లలను గుర్తించి దగ్గరలోని పాఠశాలల్లో చేర్పించాలన్నారు. ఆన్‌లైన్ పరీక్షల నిర్వహణపై ఆరా తీశారు. ఏజెన్సీలోని ఐదు ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో గల అంగన్‌వాడీ కేంద్రాల్లో బాలలకు ఆటపాటలతో చదువుపై దృష్టి పెట్టే విధంగా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఏజెన్సీలో శిశువుల గురించి నివేదికలు సమర్పించాలన్నారు. ఎంఈవో వి.ముత్యాలరావు, త్రిమూర్తులు, శంభుడు, శాంతి తదితరులు పాల్గొన్నారు.


