సమస్యలపై వెల్లువెత్తిన అర్జీలు
రంపచోడవరం: వై.రామవరం మండలం చవిటిదిబ్బల గ్రామంలో గురుకుల జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని, అందుకు అవసరమైన భూమిని గ్రామానికి చెందిన గొర్లె రాజేష్‌బాబు వితరణ చేస్తారని ఎంపీపీ ఆనంద్, జెడ్పీటీసీ సభ్యురాలు కర్ర వెంకటలక్ష్మి, వెదుళ్ల లచ్చిరెడ్డి, సర్పంచ్ బచ్చల చిన్నఅమ్ములు ఐటీడీఏ పీవో స్మరణ్‌రాజ్‌ను కోరారు. 30 గ్రామాల వారు పదో తరగతి విద్యార్థులున్నారని తెలిపారు. ఐటీడీఏ సమావేశపు హాలులో పీవో స్మరణ్‌రాజ్ సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో 136 అర్జీలు అందాయి.రాజవొమ్మంగిలో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు చేయాలని, 50 ఎకరాల భూమిని గుర్తించి పరిశ్రమల కోసం కేటాయించాలని వంతు బాలకృష్ణ అర్జీ అందజేశారు. వై.రామవరం ఎగువ ప్రాంతంలో పది గ్రామాల గిరిజనులకు పూర్తిస్ధాయిలో తాగునీరు అందించే విధంగా వాటర్ ట్యాంకులు ఏర్పాటు చేయాలని సారంకోట అబ్బాయిరెడ్డి కోరారు. పోలవరం ప్రాజెక్టు, ముసురుమిల్లి ప్రాజెక్టుల ఆర్‌అండ్‌ఆర్ కాలనీల్లో 86 కుటుంబాలకు పూర్తిస్థాయిలో తాగునీరు అందించేందుకు ట్యాంకులు ఏర్పాటు చేయాలని, శ్మశానవాటిక ఏర్పాటు చేయాలని పీసా ఉపాధ్యక్షుడు మిర్తివాడ వీరబాబు , సిరిసం కృష్ణలు అర్జీ అందజేశారు. ఏపీవో డి.ఎన్.వి.రమణ, డీడీ రుక్మాండయ్య, ఏజెన్సీ డీఈవో వై.మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


