విత్తనోత్పత్తి కేంద్రం ఏర్పాటుకు నిధులు
చింతపల్లి: చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానంలో విత్తనోత్పత్తి కేంద్రాన్ని తొలిసారిగా ప్రారంభిస్తున్నట్టు వ్యవసాయ పరిశోధన స్థానం అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసర్చ్ డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు. మన్య ప్రాంతంలో గిరిజనులకు మరింత నాణ్యమైన విత్తనాలను అందుబాటులోనికి తెచ్చే విధంగా అఖిల భారత సమన్వయ పరిశోధన ప్రాజెక్టులో భాగంగా కేంద్ర ప్రభుత్వం విత్తనోత్పత్తి కేంద్రానికి రూ.80 లక్షలు నిధులు మంజూరు చేసినట్టు తెలిపారు. ఆ నిధులతో రూ.35 లక్షలతో యంత్రాలు, రూ.20లక్షలతో భవనాలు, మరో రూ.25 లక్షలతో వలశెలు విత్తన హబ్‌నకు కేటాయించినట్టు తెలపారు. ఈ నెలాఖరు నాటికి టెండర్లు ప్రక్రియ పూర్తవుతుందన్నారు. వచ్చే ఏడాది నుంచి ఈ విత్తనోత్పత్తి కేంద్రం అందుబాటులోనికి రానుందన్నారు. ఈ విత్తనోత్పత్తి కేంద్రం అందుబాటులోనికి వస్తే గిరిజన రైతాంగానికి మరింత నాణ్యమైన విత్తనాలను ఉత్పత్తి చేసి మంచి దిగుబడులు సాధించడానికి ప్రోత్సహించవచ్చునన్నారు. ముఖ్యంగా విత్తనోత్పత్తి ద్వారా విత్తన శుద్ధితో పాటు సర్టిఫికేషన్ చేయవచ్చునన్నారు. గిరిజన రైతాంగం ఇప్పటి వరకూ మైదాన ప్రాంతాల నుంచి విత్తనాలను తీసుకువచ్చి సాగు చేపడుతున్నారన్నారు. ఇప్పటి నుంచి ఈప్రాంత రైతాంగానికి అవసరమైన వరి, వలిశెలు, రాజ్‌మాతో పాటు చిరుధాన్యాలు పంటలకు సంబంధించిన విత్తనాలను ఈ విత్తనోత్పత్తి కేంద్రం ద్వారానే పొందే అవకాశం ఉంటుందన్నారు.


