మహిళలపై దాడులను నియంత్రించాలి
చింతూరు: మహిళలపై జరుగుతున్న హింసాత్మక దాడులు, అత్యాచారాల నియంత్రణకు ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని ఐద్వా జిల్లా అధ్యక్షురాలు మడివి శ్రీదేవి డిమాండ్ చేశారు. మహిళా హింస అనే అంశంపై ఆదివారం చింతూరులో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు హింసకు గురవుతున్నారని, వీటికి ప్రధాన కారణమైన మద్యం షాపులను ప్రభుత్వాలు ఆదాయ వనరుగా మార్చుకున్నాయేని విమర్శించారు. విచ్చలవిడిగా మద్యం షాపులు, బార్లకు లైసెన్సులు ఇవ్వడంతో పాటు బెల్ట్‌షాపుల ద్వారా ప్రజా సంపదను కొల్లగొడుతున్నారని ఆమె ఆరోపించారు. మాదకద్రవ్యాల కారణంగా యువత తప్పుదారిలో నడుస్తుందని, ప్రభుత్వం మద్యాన్ని నియంత్రించడంలో నిర్లక్ష్యం కారణంగా సమాజంలో మహిళలపై అనేక ఘోరాలు జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఐద్వా ప్రతినిధులు ముర్రం రంగమ్మ, బట్ట రాములమ్మ, మల్లం సుబ్బమ్మ, జయలక్ష్మి పాల్గొన్నారు.


