జీతాలకూ ఎదురుచూపులే.. | - | Sakshi
Sakshi News home page

జీతాలకూ ఎదురుచూపులే..

Dec 8 2025 8:04 AM | Updated on Dec 8 2025 8:04 AM

జీతాలకూ ఎదురుచూపులే..

జీతాలకూ ఎదురుచూపులే..

● కేజీహెచ్‌, ఏఎంసీ అవుట్‌సోర్సింగ్‌ సిబ్బంది అవస్థలు ● అన్ని అనుమతులున్నా ఫైల్‌ తొక్కిపెట్టారని విమర్శలు

మహారాణిపేట: అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం.. ప్రస్తుతం వారిని నెలల తరబడి పస్తులు ఉంచుతోంది. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా ఏడు నెలల పాటు జీతాలు ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. ప్రధానంగా వైద్య రంగంలో కీలకమైన కేజీహెచ్‌, ఆంధ్రా మెడికల్‌ కాలేజీల్లో పనిచేస్తున్న 39 మంది అవుట్‌సోర్సింగ్‌ సిబ్బంది జీతాల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. వీరు ఈ ఏడాది మే నుంచి విధుల్లో ఉన్నారు. నాటి నుంచి నేటి వరకు వారికి ఒక్క రూపాయి కూడా జీతం అందలేదు. ఏడు నెలలుగా జీతాలు రాకపోవడంతో కుటుంబాలను పోషించుకోవడం కష్టంగా మారిందని, ఇల్లు గడవని దుస్థితి నెలకొందని వారు వాపోతున్నారు. జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియక వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

అనుమతులున్నా..

అవుట్‌సోర్సింగ్‌ సిబ్బంది నియామకం కోసం ఇన్‌చార్జి మంత్రి, కలెక్టర్‌ నుంచి అనుమతులు వచ్చినా, ఆ ఫైల్‌ ముందుకు కదలడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. నిబంధనల ప్రకారం కలెక్టర్‌ అనుమతి ఇచ్చిన ఫైల్‌ను ఎంప్లాయిమెంట్‌ అధికారి ద్వారా ఏపీ అవుట్‌సోర్సింగ్‌ శాఖకు పంపి ఆమోదం పొందాల్సి ఉంది. కానీ, ఆ ఫైల్‌ను ఎంప్లాయిమెంట్‌ అధికారికి పంపకుండా కేజీహెచ్‌లోనే తొక్కిపెడుతున్నట్లు సమాచారం.

పర్యవేక్షణ లోపం : కేజీహెచ్‌, ఏఎంసీలలో అడుగడుగునా పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. పరిపాలన లోపాలు, ఆధిపత్య పోరు వల్ల రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేజీహెచ్‌ సూపరింటెండెంట్‌, ఏఎంసీ ప్రిన్సిపాల్‌ పేరుకే ఉన్నారు గానీ.. పలు కార్యకలాపాల్లో అధికారుల అతిజోక్యం వల్ల పనులు సకాలంలో జరగడం లేదు. అనేక పాలనాపరమైన అంశాలు కుంటుపడుతున్నాయి.

కలెక్టర్‌ చొరవ చూపాలి

గత ఏడు నెలలుగా జీతాలు లేక, ఎవరికి చెప్పుకోవాలో తెలియక, ఉద్యోగ భద్రతపై భయంతో సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. ఆకలితో అలమటిస్తున్న 39 కుటుంబాలను ఆదుకునేందుకు కలెక్టర్‌ తక్షణమే స్పందించి, తమకు న్యాయం చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు.

జీతాలకూ లంచాలా?

పెండింగ్‌లో ఉన్న జీతాల ఫైలును కదిలించడానికి కేజీహెచ్‌లోని కొందరు అధికారులు బేరసారాలకు దిగినట్లు తెలుస్తోంది. వైరాలజీ ల్యాబ్‌, ఇతర వార్డుల్లో పనిచేస్తున్న సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని ముడుపులు డిమాండ్‌ చేస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వచ్చే చాలీచాలని జీతంతో కుటుంబాన్ని పోషించుకోవాలా? లేక అధికారులకు ముడుపులు ఇవ్వాలా? అని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement