వైకల్యాన్ని అధిగమిస్తే అద్భుత ఫలితాలు
● డీఈవో అప్పారావునాయుడు
● ఉత్సాహంగా దివ్యాంగ బాలల
ఆటల పోటీలు
అనకాపల్లి టౌన్: వైకల్యాన్ని అధిగమించి ఆత్మస్దైర్యాన్ని పెంపొందించుకోవాలని, దివ్యాంగ బాలబాలికల అభిరుచులకు తగిన విధంగా తర్ఫీదునివ్వాలని జిల్లా విద్యాశాఖాధికారి గిడ్డి అప్పారావు నాయుడు అన్నారు. స్థానిక ఏఎంఏఎల్ కళాశాల క్రీడా మైదానంలో సమగ్ర శిక్ష, సహిత విద్యా విభాగం, పారాస్పోర్ట్స్ అసోసియేషన్ ఆంఽధ్రప్రదేశ్ సంయుక్తంగా నిర్వహించిన పారా పోటీలు ఆదివారం జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీఈవో మాట్లాడుతూ దివ్యాంగ బాలబాలికలను ఆదరించి వారిలో ఆత్మస్థయిర్యాన్ని పెంపొందిస్తే అద్బుతాలు సృష్టిస్తారని తెలిపారు. దివ్యాంగులు వివిధ రంగాల్లో ముఖ్యంగా క్రీడా రంగాల్లో గెలుపొందిన వారి విజయగాధలను తెలిపి తల్లిదండ్రుల్లో, దివ్యాంగ విద్యార్థులలో స్పూర్తిని నింపారు. సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ పి అప్పారావు మాట్లాడుతూ తల్లిదండ్రులు దివ్యాంగ విద్యార్థులకు అందిస్తున్న సేవలు మహోన్నతమైనవని అన్నారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ నిరంజన్, పారాస్పోర్స్ కోచ్‌లు రాజేష్, అప్పారావు, వివిధ పాఠశాలల ఫిజికల్ డైరక్టర్‌లు, ఉపాద్యాయులు బి.ఎ. రాజు, మహాలక్ష్మి నాయుడు, దేముడు నాయుడు, జగన్నాథం నాయుడు, పోలిరాజు పాల్గొన్నారు.


