‘శంబాల’ ఏ ఒక్కర్నీ నిరాశ పరచదు
హీరో ఆది సాయికుమార్
డాబాగార్డెన్స్: సూపర్ నేచురల్ థ్రిల్లర్ చిత్రం ‘శంబాల’ యూనిట్ ఆదివారం నగరంలో సందడి చేసింది. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి యుగంధర్ ముని దర్శకత్వం వహిస్తున్నారు. ఆది సాయికుమార్ హీరోగా నటించిన ఈ సినిమాలో అర్చన అయ్యర్, సావసిక, రవివర్మ, మధునందన్, శివకార్తీక తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ నెల 25న విడుదల కాబోతున్న శంబాల చిత్రం ట్రైలర్‌ను డార్లింగ్ ప్రభాస్ విడుదల చేయడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన రావడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ జోరు పెంచింది. ఈ సందర్భంగా ఆదివారం నగరంలోని ఓ హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో హీరో ఆది సాయికుమార్ మాట్లాడుతూ తమ టీజర్‌ను రిలీజ్ చేసిన దుల్కర్‌కు, సహకారమందిస్తున్న థమన్, స్నేహితుడు సందీప్ కిషన్, ట్రైలర్ విడుదల చేసిన డార్లింగ్ ప్రభాస్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రమోషనల్ కంటెంట్‌కు అన్ని చోట్లా పాజిటివ్ స్పందన వస్తుండడం ఆనందంగా ఉందన్నారు. టీజర్‌కు మంచి స్పందన రావడంతో సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయిందని, అందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ఈ క్రమంలో తమకు సహకరించిన వంశీ, ప్రమోద్, ప్రసాద్‌కు కృతజ్ఞతలు చెబుతూ, ట్రైలర్ చూసిన కిరణ్ అబ్బవరం, రానా కూడా మెచ్చుకున్నారని తెలిపారు. ఈ మూవీకి తన వంతు సాయం చేస్తానని రానా మాటిచ్చారన్నారు. హిందీ రిలీజ్ గురించి అందరూ అడుగుతున్నారని, నిర్మాతలు ఎక్కడా కూడా రాజీ పడకుండా ఈ మూవీని నిర్మించారన్నారు. యుగంధర్ ఈ మూవీని అద్భుతంగా రూపొందించారని, ఈ నెల 25న చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు తెలిపారు. హీరోయిన్ అర్చనా అయ్యర్ మాట్లాడుతూ శంబాల వంటి అద్భుతమైన చిత్రంలో మంచి పాత్ర పోషించడం ఆనందంగా ఉందన్నారు.


