కాఫీ రైతులకు పూర్తి సహకారం
● పాడేరు ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ
● చింతపల్లిలో పల్పింగ్ యూనిట్ సందర్శన
చింతపల్లి: కాఫీ రైతులకు ప్రభుత్వం తరఫున పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని పాడేరు ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ అన్నారు. శనివారం ఆమె స్థానిక కాఫీ పల్పింగ్ యూనిట్‌ను సందర్శించారు. రైతుల నుంచి సేకరించిన కాపీ పండ్లు, పార్చిమెంట్, డ్రయింగ్ యార్డ్‌ను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతుల నుంచి సేకరించిన పండ్లను కూడా గ్రేడ్‌లు విభజించి పార్చమెంట్ చేసి ఆరబెట్టాలని ఆదేశించారు. అరకు కాఫీకి అంతర్జాతీయ స్థాయిలో అత్యున్నతమైన ప్రాధాన్యం ఉన్నందున అందుకు తగ్గట్టుగా రైతుల పంటను సేకరించి మంచి ఆదాయం ఆర్జించాలన్నారు. రైతులకు అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి మార్కెట్ ధరలకు అనుగుణంగా కాఫీ పండ్లకు గిట్టుబాటు ధర ప్రకటించినట్టు పీవో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ కాఫీ ఏడీ జి.అప్పలనాయుడు, మాక్స్ అధ్యక్షుడు సింహాచలం, ఉపాధ్యక్షుడు నారాయణ, కోశాధికారి గోవిందు, ఏవీవో ధర్మారాయ్, బోర్డు సభ్యులు, కాఫీ సిబ్బంది, లైజన్‌వర్కర్లు పాల్గొన్నారు.


