విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేయండి
అనంతగిరి (అరకులోయ టౌన్): విద్యార్థుల బంగారు భవిష్యత్‌కు ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సమన్వయం ఎంతో అవసరమని స్థానిక ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. శుక్రవారం స్థానిక ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల ఉన్నత పాఠశాల 1,2లో జరిగిన తల్లిదండ్రులు ఉపాద్యాయుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. విద్యార్థుల విద్య, వారి ప్రవర్తన, పాఠశాల అభివృద్ధిపై ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు కలిసి చర్చించుకోవలసిన అవసరం ఉందన్నారు. మానసిక, శారీరక దృఢత్వం పెంపొందించేందుకు యోగా, క్రీడలను ప్రతిరోజు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమాన్ని ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం జిల్లాస్థాయి క్రీడా పోటీల్లో విజేతలకు ప్రశంసా పత్రాలను ఎమ్మెల్యే అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో బాలాజీ, ఎంపీపీ శెట్టి నీలవేణి, జెడ్పీటీసీ సభ్యుడు దీసరి గంగరాజు, మండల పార్టీ అధ్యక్షుడు కొర్రా సూర్యనారాయణ, సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు పాగి అప్పారావు, సర్పంచ్‌లు కొర్రా సింహాదిర, సోమెల రూతు, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి గుజ్జెలి మధుసూదన్ పాల్గొన్నారు.
అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం


