ఆంధ్రా కాంట్రాక్ట్ ఉద్యోగులకు రక్షణ కల్పించండి
ముంచంగిపుట్టు: ఆంధ్రా– ఒడిశా రాష్ట్రాల ఉమ్మడి నిర్వహణలో ఉన్న మాచ్‌ఖండ్ జల విద్యుత్ కేంద్రంలో కాంట్రాక్ట్ పద్ధతిలో విధులు నిర్వహించే ఉద్యోగులకు రక్షణ కల్పించాలని బిర్సా ముండా ఎస్టీ మ్యూచ్‌వల్ ఎయిడెడ్ లేబర్ కాంట్రాక్ట్ కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడు వనుగు శేషాద్రి, మదన బిర్సా ముండా కోరారు. గురువారం వారు తహసీల్దార్ భాస్కరఅప్పారావును కలిసి సమస్యను వివరించారు. ఆంధ్రాకు చెందిన కాంట్రాక్ట్ ఉద్యోగులకు పూర్తి స్థాయిలో రక్షణ కల్పించేలా ఇరురాష్ట్రాల జెన్‌కో అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి, సమస్య పరిష్కారంకు చర్యలు తీసుకోవాలని వారు విన్నవించారు. ఈ సందర్భంగా శేషాద్రి, మదన బిర్సాముండా మాట్లాడుతూ మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రంలో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న ఐదుగురు ఉద్యోగులకు మాచ్‌ఖండ్ ప్రాజెక్టులో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ఒడిశాకు చెందిన కొంతమంది వ్యక్తులు విధులకు వెళ్లే సమయంలో అడ్డుకోవడం, మానసిక వేధింపులు, భౌతిక దాడులు చేస్తున్నారని ఆరోపించారు. పలుసార్లు ఇరురాష్ట్రాల అధికారులకు తెలియజేసినా వారికి ఎటువంటి రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మాచ్‌ఖండ్ ప్రాజెక్టు ఒడిశాకు చెందినదని, ఆంధ్రకు చెందిన కాంట్రాక్ట్ ఉద్యోగులను పని చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. తక్షణమే ఇరురాష్ట్రాల జెన్‌కో అధికారులతో మాట్లాడి, విధులు నిర్వహించే ఉద్యోగులకు అన్ని విధాలుగా రక్షణ కల్పించాలని వారు కోరారు. మాచ్‌ఖండ్‌లో ఆంధ్రాకు కేటాయించిన అన్ని హక్కులు అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన తహసీల్దార్ భాస్కరఅప్పారావు మాట్లాడుతూ సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి, సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. సొసైటీ సభ్యులు బాలకృష్ణ, బాబూజీ పాల్గొన్నారు.
బిర్సాముండా ఎస్టీ మ్యూచ్‌వల్ ఎయిడెడ్ లేబర్ కాంట్రాక్ట్ కోఆపరేటివ్ సొసైటీ వినతి


