రక్తదాన శిబిరం విజయవంతం
అరకులోయటౌన్: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో గురువారం నిర్వహించిన రక్తదాన శిబిరం విజయవంతమైంది. కలెక్టర్, రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షుడు ఏఎస్ దినేష్‌కుమార్, పాడేరు ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ శిబిరాన్ని రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ ఎం.గంగరాజు అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని రక్త నిల్వలు పెంచాల్సిన అవసరం ఉందన్నారు. గర్భిణులు, బాలింతలు, సికిల్ సెల్ ఎనీమియా బాధితులకు అత్యవస పరిస్థితుల్లో ఉపయోగపడుతుందన్న అవగాహనతో రక్తదానం చేసేందుకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరారు. అపోహలను విడనాడి రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలన్నారు. ప్రతీ మూడు నెలలకు ఒక సారి రక్తదానం చేయవచ్చన్నారు. జిల్లాలోని పాడేరు జిల్లా ఆస్పత్రిలో రోగులకు అత్యవసర సమయాల్లో రెడ్ క్రాస్ సొసైటీ ఉచితంగా రక్తం అందిస్తుందని, ఇందుకు ప్రజల సహకారం అవసరమన్నారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు, స్థానికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరి నుంచి 25 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కుమార స్వామి, ఎంపీడీవో అడప లవరాజు, సీఐ ఎల్.హిమగిరి, ఈవోపీఆర్‌డీ డాక్టర్ రాఘవేంద్ర, ఏటీడబ్ల్యూవో వెంకటరమణ, వైకుంఠరావు, ఎంఈవో వంతాల త్రినాథరావు, ఆర్‌ఐ పట్టాసి శంకర్‌రావు పాల్గొన్నారు.


